ఒంటికాలిపై పారిశుధ్య కార్మికుల నిరసన

ప్రజాశక్తి-గుంటూరు, నరసరావుపేట : మున్సిపల్‌ కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ మున్సిపల్‌ కార్మికుల చేపట్టిన నిరవధిక సమ్మె 7వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా గుంటూరు నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం ఎదుట సమ్మె శిబిరంలో కార్మికులు ఒంటికాలిపై నిల్చొని, దండం పెడుతూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ది గుంటూరు జిల్లా మున్సిపల్‌ ఎంప్లాయిస్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ (సిఐటియు అనుబంధం) జిల్లా ప్రధాన కార్యదర్శి బి.ముత్యాలరావు మాట్లాడుతూ మాట తప్పను మడమ తిప్పను అని గొప్పలు చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి మున్సిపల్‌ కార్మికులకు ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయలేదని విమర్శించారు. నాలుగున్నరేళ్లుగా ఆందోళనలు చేస్టున్నా ప్రభుత్వం పట్టించుకోలేదని, ఇప్పుడు నిరవధిక సమ్మె చేస్తున్నా ప్రభుత్వానికి కనిపించట్లేదని విమర్శించారు. సమ్మెకు గుంటూరు నగర భవన నిర్మాణ కార్మిక సంఘం పశ్చిమ కమిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డి.కోటేశ్వరరావు, షేక్‌ ఖాసింవలి, గుంటూరు జిల్లా అపార్ట్‌మెంట్స్‌ వాచ్‌మెన్స్‌ అండ్‌ మెయింటినెన్స్‌ వర్కర్స్‌ యూనియన్‌ (సిఐటియు) గౌరవాధ్యక్షులు ఆది నికల్సన్‌ మద్దతిచ్చారు. పట్టణాలను నిత్యం పరిశుభ్రంగా ఉంచుతున్న కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాల్సిన బాధ్యత ఉందన్నారు. కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు పి.శ్రీనివాసరావు, పి.పూర్ణచంద్రరావు, జి.సురేష్‌, కాటమరాజు, జి.శ్రీనివాసరావు, కె.మరియదాసు, బాలప్రసాద్‌, జి.శ్రీనివాసరావు, రామకృష్ణ, నరేంద్ర, కె.శివయ్య, కె.భాగ్యరాజు, పోలేశ్వరమ్మ, సుజాత, సారమ్మ పాల్గొన్నారు.

పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని సమ్మె శిబిరం కొనసాగింది. కార్యక్రమానికి మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా గౌరవ అధ్యక్షులు షేక్‌ సిలార్‌ మసూద్‌, మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి ఎ.సాల్మన్‌ అధ్యక్షత వహించారు. వీరికి మద్దతుగా శ్రామిక మహిళ సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్‌ డి.శివకుమారి మాట్లాడారు. కార్మికులు తమ సమస్యలను ప్రభుత్వానికి అనేకసార్లు విన్నవించినా స్పందించని నేపథ్యంలో కార్మికులు సమ్మెకు దిగారని చెప్పారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారమే కనీస వేతనం, గ్రాట్యుటీ ఇవ్వాలని కోరుతున్నా ప్రభుత్వంలో స్పందన లేవి దారుణమన్నారు. మున్సిపల్‌ కార్మికులు ప్రభుత్వం కింద పని పనిచేస్తున్నారా లేదా ఆప్కాస్‌ కింద పని చేస్తున్నారా అని ప్రశ్నించారు. ప్రభుత్వం ఎన్నో విధాలుగా అడ్డంకులకు, బెదిరింపులుకు గురిచేసినా సమ్మెను కొనసాగిస్తున్న కార్మికులను అభినందించారు. మున్సిపల్‌ కార్మికులకు కోరుతున్న సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగుల పర్మినెంట్‌, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌, గ్రాట్యుటీ, హెల్త్‌ మరియు రిస్క్‌ అలవెన్స్‌ లాంటి డిమాండ్లను నెరవేరుస్తామని రాతపూర్వకంగా ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసారు. సమ్మెలో యూనియన్‌ పట్టణ అధ్యక్షుడు టి.మల్లయ్య, కార్యదర్శి డి.యోహాను, నవీన్‌, విజరు కుమార్‌, పి.ఏసు, కె.ప్రసాద్‌, సాల్మన్‌ పాల్గొన్నారు.

➡️