ఒప్పంద జిఒలను విడుదల చేయాలి

Jan 29,2024 21:12

 ప్రజాశక్తి- రాజాం : మున్సిపల్‌ కాంట్రాక్ట్‌ అండ్‌ అవుట్‌ సోర్సింగ్‌ కార్మికుల రాష్ట్ర వ్యాప్త సమ్మె సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిన ఒప్పంద జీవోలను వెంటనే విడుదల చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి సిహెచ్‌ రామ్మూర్తినాయుడు డిమాండ్‌ చేశారు. రాజాం మున్సిపల్‌ కార్యాలయం వద్ద సోమవారం కార్మికులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రామ్మూర్తినాయుడు మాట్లాడుతూ మున్సిపల్‌ కార్మికుల సమస్యలపై చర్చల్లో అంగీకరించిన ఒప్పందాలకు సంబంధించి ప్రభుత్వం జీవో విడుదల చేయాలన్నారు. ప్రభుత్వం మీద నమ్మకంతో సమ్మె విరమించి 15 రోజులు గడుస్తున్నా చర్చల్లో చేసుకున్న ఒప్పందాలకు సంబంధించి జీవోలు విడుదల చేయకుండా జాప్యం చేస్తుందని ఆగ్రహించారు. సమ్మె కాలానికి వేతనం చెల్లించడంలో జాప్యం చేస్తున్నారన్నారు. కాంట్రాక్ట్‌ కార్మికులకు రూ.21వేలు, డ్రైవర్లకు రూ.24,500, దహన సంస్కార ఖర్చులు రూ.20వేలు చెల్లింపు, విధుల్లో చనిపోయినవారికి నష్టపరిహారం, బకాయిలు, సరెండర్‌ లీవ్‌లు, 23 శాతం వేతనం పెంపు తదితర ఒప్పందాలకు సంబంధించిన జీవోలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యేలకు వినతిపత్రం ఇస్తామని తెలిపారు. సమస్యలపై ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం పరిష్కరించాలని లేదంటే మరో పోరాటం తప్పదని హెచ్చరించారు. ధర్నాలో యూనియన్‌ అధ్యక్ష కార్యదర్శులు శ్రీనివాసరావు, అనిల్‌ కుమార్‌, లక్ష్మీ, గురువులు, గిరిబాబు, సింహాచలం, శోభన్‌ బాబు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

➡️