దుకాణ సముదాయానికి శ్లాబ్‌  వేయాలి

దుకాణ సముదాయానికి శ్లాబ్‌  వేయాలి

ప్రజాశక్తి -భీమునిపట్నం : జివిఎంసి దుకాణ సముదాయం పైకప్పును రేకులతో కాకుండా పూర్తి స్థాయిలో శ్లాబు వేయాలని జెడ్‌సి కనకమహాలక్ష్మి, పట్టణ ప్రణాళికావిభాగం ఎసిపి డి.శ్రీనివాసరావులను ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆదేశించారు. శుక్రవారం మెయిన్‌ రోడ్డు పక్కన నిర్మాణంలో ఉన్న షాపింగ్‌ కాంపెక్స్‌ను అధికారులతో కలిసి పరిశీలించారు. నిర్మాణ వివరాలు, బిల్లుల చెల్లింపుపై అధికారులను ప్రశ్నించారు. రూ.1.66 కోట్ల నిధులతో ముందు వరుసలో 12, వెనుకన 28 దుకాణాలను నిర్మిస్తున్నట్లు ఎమ్మెల్యే గంటాకు ఎసిపి శ్రీనివాసరావు వివరించారు. ఇప్పటివరకు కేవలం రూ.పది లక్షలు మాత్రమే నిధులు విడుదలయ్యాయన్నారు. పూర్తిస్థాయిలో నిధులు లేనందువల్లే పైకప్పును శ్లాబ్‌ కాకుండా రేకులు వేస్తున్నట్లు ఎమ్మెల్యే గంటాకు అధికారులు తెలిపారు. దీనిపై ఎమ్మెల్యే గంటా స్పందిస్తూ, శాశ్వతంగా ఉండేలా పైకప్పు శ్లాబ్‌ వేయాలని, నిధులు చాలకుంటే దుకాణాల సంఖ్యను కుదించాలని సూచించారు. మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారమే రోడ్ల విస్తరణజోన్‌ పరిధిలో ప్రతిపాదించిన ఏడు రోడ్లను మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారమే విస్తరించాలని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రాధాన్యతల వారీగా తొలుత ప్రధాన రహదారిని విస్తరించాలన్నారు. తహసీల్దార్‌ కార్యాలయం నుంచి గంట స్తంభం వరకు, అలాగే గంట స్తంభం నుంచి పోలీస్‌స్టేషన్‌ వరకు ప్రస్తుతమున్న రోడ్డును 66 అడుగులకు విస్తరించాలని ఆదేశించారు. ఎస్‌బిఐ నుంచి బీచ్‌ రోడ్డు మీదుగా జెడ్‌పి గెస్ట్‌ హౌస్‌ వరకు రోడ్డును 60 అడుగుల వెడలు చేయాలన్నారు.విస్తరణలో ఆస్తులను కోల్పోయిన వారికి వాటి విలువకు నాలుగురెట్లు టిడిఆర్‌ ఇస్తామని ఎసిపి వివరించారు మెయిన్‌ రోడ్డులో 60, బీచ్‌ రోడ్డులో దాదాపు 45 శాశ్వత దుకాణాలు, ఇళ్లు కోల్పోయే అవకాశం ఉందని ఎసిపి తెలిపారు. తగరఫువలసలోనూ రోడ్డు విస్తరణ చేపట్టాలని అధికారులకు ఎమ్మెల్యే ఆదేశించారు.

షాపింగ్‌ కాంపెక్స్‌ నిర్మాణాలను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే గంటా

➡️