ఓటరు జాబితాలో మార్పులపై నివేదిక

ప్రజాశక్తి – పార్వతీపురం : ఓటర్ల ముసాయిదా జాబితా ప్రచురించిన అక్టోబర్‌ 27 నుంచి ఇప్పటి వరకూ అందులో చేసిన మార్పులు, చేర్పులు, ఇతర సవరణలకు గల కారణాలతో నివేదికలు రూపొందించాలని ఎన్నికల రోల్‌ అబ్జర్వర్‌, ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి జె. శ్యామలరావు అన్నారు. జిల్లా పర్యటనకు విచ్చేసిన ఆయన ఓటరు నమోదు అధికారులతో జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఫారం 6,7,8 దరఖాస్తుల ఆధారంగా ఓటర్ల జాబితా రూపకల్పనలో అవలంబిస్తున్న విధానాల గురించి, చేపడుతున్న చర్యల గురించి అసెంబ్లీ నియోజకవర్గాలు, పోలింగు కేంద్రాల వారీగా సమీక్షించారు. జనాభా – ఓటరు నిష్పత్తిలో తేడాల్లేకుండా చర్యలు తీసుకోవాలని, ఎక్కువ నిష్పత్తిలో ఉంటే కారణాలు విశ్లేషించాలని సూచించారు. ఈ సందర్భంగా రోల్‌ అబ్జర్వర్‌ మాట్లాడుతూ ప్రతి దరఖాస్తు పక్కాగా విచారణ జరగాలని, ఎండార్సుమెంటు నివేదిక సరిపోవాలని ఆదేశించారు. విచారణకు సంబంధించిన పత్రాలు నిర్దిష్టంగా ఉండాలని, చేర్పులు మార్పులు జరిగితే వాటి వివరాలు స్పష్టంగా ఉండాలని అన్నారు. మృతి చెందిన ఓటర్ల తొలగింపు ప్రక్రియ పక్కాగా చేపట్టాలని, సంబంధిత పత్రాలు ఉండాలని అన్నారు. ఓటరు నమోదు, సవరణ ప్రక్రియ చక్కగా చేపట్టి తప్పుల్లేని ఓటరు జాబితా రూపకల్పన చేయాలన్నారు. డిసెంబరు 26 వరకు అందిన అభ్యంతరాలు, క్లైమ్‌ లు పరిష్కరించి తప్పుల్లేని తుది ఓటరు జాబితా ప్రకటించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జెసి ఆర్‌. గోవిందరావు మాట్లాడుతూ అందిన ప్రతి ఫిర్యాదును విచారిస్తున్నామన్నారు. మృతి చెందిన ఓటర్ల వివరాలు ఓటరు నమోదు అధికారి విధిగా పరిశీలించాలని ఆదేశించామనిచెప్పారు. ఆరోగ్యవంతమైన ఓటరు జాబితా తయారీకి కృషి చేస్తున్నామన్నారు. ఫారం 6,7,8 దరఖాస్తుల పరిశీలనసమావేశం అనంతరం ఓటర్ల జాబితా పరిశీలకులు ఒక్కో నియోజకవర్గం నుంచి అయిదు పోలింగు కేంద్రాలకు చెందిన దరఖాస్తులను పరిశీలించారు. పోలింగ్‌ స్టేషన్‌ పరిధిలో సేకరించిన ఫారం 6, 7, 8 దరఖాస్తులను తనిఖీ చేశారు. సమావేశంలో డిఆర్‌ఒ జె.వెంకటరావు, ఓటరు నమోదు అధికారులు – సీతంపేట, పార్వతీపురం ఐటిడిఎ పిఒలు కల్పనాకుమారి, సి.విష్ణు చరణ్‌, పార్వతీపురం, పాలకొండ ఆర్‌డిఒలు కె.హేమలత, ఎం.లావణ్య, కెఆర్‌ఆర్‌సి ఎస్డిసి జి.కేశవనాయుడు, ఎలక్షన్‌ సెక్షను సూపరింటెండెంటు రవికుమార్‌ పాల్గొన్నారు.

➡️