కందిపప్పు ఎత్తేశారు

ప్రజాశక్తి-యర్రగొండపాలెం: యర్రగొండపాలెం నియోజకవర్గంలోని యర్రగొండ పాలెం, పుల్లలచెరువు, త్రిపురాంతకం మండలాల్లో డిసెంబర్‌ నెల కోటా కందిపప్పు కార్డుదారులకు పంపిణీ చేయలేదు. కాగా డిసెంబర్‌ కోటాలో జిల్లా వ్యాప్తంగా 666.92 టన్నుల కందిపప్పు అవసరం కాగా కేవలం 200 టన్నులు మాత్రమే కందిపప్పును సరఫరా చేసినట్లు జిల్లా అధికారులు తెలిపారు. వాటిని అరకొరగా సర్దుబాటు చేసుకున్నట్లు పేర్కొన్నారు. కాగా యర్రగొండపాలెం మండలంలో 43 రేషన్‌ షాపుల పరిధిలో 20 వేల రేషన్‌ కార్డులు ఉన్నాయి. పుల్లలచెరువు మండలంలో 42 రేషన్‌ షాపుల పరిధిలో 17 వేల రేషన్‌ కార్డులున్నాయి. అలాగే త్రిపురాంతకం మండలంలో 35 రేషన్‌ షాపుల పరిధిలో 19 వేల రేషన్‌ కార్డులు ఉన్నాయి. ఈ రేషన్‌ కార్డులకు గాను కనీసం ఒక్కరికి కూడా డిసెంబర్‌ నెలలో కందిపప్పు సరఫరా కాలేదు. దీంతో బయట మార్కెట్‌లో కేజీ రూ. 190లకు కొనుగోలు చేయలేక పేదలు పప్పుకు దూరమయ్యారు. దీనికి తోడు ఈ ప్రాంతంలో ఎక్కువగా దళితులు ఉన్నారు. వారంతా క్రిస్మస్‌ పండుగను ఘనంగా జరుపుకుంటారు. అయితే పండుగకు కూడా కందిపప్పు సరఫరా చేయకపోవడం పట్ల వారు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. కార్డుదారులెవరికీ పంపిణీ చేయకుండా కందిపప్పును ఎత్తేశారంటూ ఆరోపిస్తున్నారు. ఈ విషయమై యర్రగొండపాలెం సివిల్‌ సప్లై గోదాము ఇన్‌ఛార్జి అన్నపురెడ్డి తిరుపతిరెడ్డిని వివరణ కోరగా డిసెంబర్‌ నెలకు కందిపప్పు అలాట్‌మెంట్‌ కాలేదని,అందుకే రేషన్‌ షాపుల ద్వారా పంపిణీ కాలేదని చెప్పారు.

➡️