కక్ష సాధింపు చర్యలు మానుకోవాలి

Dec 17,2023 21:15

ప్రజాశక్తి -కొమరాడ  :  అంగన్వాడీలు న్యాయమైన సమస్యలు పరిష్కరించ కుండా ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడడం సరికాదని సిఐటియు నాయకులు కొల్లి సాంబమూర్తి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో జరుగుతున్న అంగన్వాడీల సమ్మెకు మద్దతు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గడిచిన ఐదు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీలు సమ్మె కొనసాగిస్తూ ఉన్నారని, ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగా సచివాల సిబ్బంది, వాలంటీర్లు, మహిళా పోలీసులు, ఎంపిడిఒ, వెలుగు సిబ్బందితో అంగన్వాడీ కేంద్రాల తాళాలు విరగొట్టి తెరిపించాలని చూడడం సిగ్గుచేటన్నారు. తాళం కొట్టి పిల్లల తీసుకెళ్లి ఫోటోలు తీసిన ఐదు నిమిషాలకే పిల్లలను తమ ఇంటికి పంపిస్తే మరి వారికి ఆహారం, రక్షణ, చదువు, పోషకాహారం ఎవరు చూస్తారని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం అంగన్వాడీల న్యాయమైన కోరికలు తీర్చి కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పలువురు అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు, గిరిజన సంఘం మండల నాయకులు రామారావు, వెంకటేష్‌ పాల్గొన్నారు.పాలకొండ : ఆరో రోజు అంగన్వాడీ సమ్మె సందర్భంగా స్థానిక ఐసిడిఎస్‌ ప్రాజెక్టు పరిధిలో అంగన్‌వాడీ కేంద్రాల్లో లబ్ధిదారులు నిరసన వ్యక్తం చేశారు. అంగన్‌వాడీల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని, సమ్మెను విచ్ఛన్నం చేసే చర్యలు మానుకోవాలని కోరారు. అంగన్‌వాడీలకు గ్రామస్తులంతా మద్దతుగా ఎక్కడికక్కడ నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. మండలంలోని బుక్కురులో ఐద్వా ఆధ్వర్యంలో అంగన్వాడి కేంద్రం వద్ద లబ్ధిదారులు నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో పలువురు అంగన్‌వాడీ కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

➡️