కదంతొక్కిన అంగన్వాడీలు ప్రజాశకి

Dec 30,2023 21:09

-విజయనగరం టౌన్‌ :  సమస్యల పరిష్కారానికి సమ్మె చేస్తున్న అంగన్‌వాడీలు కదం తొక్కారు. శనివారం విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఇంటి ముట్టడికి యత్నించారు. అంగన్వాడీలపై రాష్ట్ర ప్రభుత్వం లేనిపోని ఆరోపణలు చేయడం మానుకోవాలని, లేదంటే తగిన గుణపాఠం చెబుతామని ఎపి అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బి.పైడిరాజు, ఎస్‌ అనసూయ హెచ్చరించారు. స్థానిక కోట జంక్షన్‌ నుంచి మూడు లాంతర్లు మీదుగా కోరాడ వీధిలో ఉన్న మంత్రి బొత్స సత్యనారాయణ ఇంటికి వేలాదిమంది అంగన్వాడీలు ర్యాలీగా చేరుకున్నారు. అప్పటికే డిఎస్‌పి గోవిందరావు ఆధ్వర్యంలో భారీగా పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేసి అంగన్వాడీలను మంత్రి ఇంటి వరకు రానివ్వకుండా కొద్ది దూరంలో అడ్డుకున్నారు. దీంతో అంగన్వాడీలు రహదారిపై బైఠాయించారు. మంత్రి బొత్స ఇంట్లో లేరని, కుటుంబ సభ్యులుమాత్రమే ఉన్నారని పోలీసులు తెలిపారు. జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి బొత్స వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేస్తూ రెండుగంటల పాటు ఆందోళన కొనసాగించారు. పోలీసులు ససేమిరా అనడంతో అంగన్వాడీ కార్యకర్తలు పోలీసులను నెట్టుకుని ఇంటికి వెళ్లేందుకు దూసుకెళ్లారు. దీంతో పోలీసులు అడ్డంగా పెట్టిన స్టాపర్స్‌ను తోసుకుంటూ ముందుకు వెళ్లారు. ఈ నేపథ్యంలో చీపురుపల్లి మండలం కోనూరు గ్రామానికి చెందిన అంగన్‌వాడీ కార్యకర్త కమల సొమ్మసిల్లి పడిపోయారు. ఈనేపథ్యంలో పోలీసులు 50 మంది నాయకులను వెంట తీసుకొని వెళ్లి మంత్రి బొత్స సత్యనారాయణ పిన్నమ్మకు వినతి పత్రం అందజేశారు.అంతకు ముందు కోట జంక్షన్‌ నుంచి భారీ ర్యాలీ నిర్వహించడంతో నగరంలో భారీగా ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. బొత్స సత్యనారాయణ ఇంటి ముట్టడి కార్యక్రమాన్ని ఉద్దేశించి యూనియన్‌ జిల్లా గౌరవ అధ్యక్షురాలు వి.లక్ష్మి, అధ్యక్ష కార్యదర్శులు బి.పైడిరాజు, ఎస్‌.అనసూయ, సి ఐ టియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె సురేష్‌,రాష్ట్ర కమిటీ సభ్యులు టివి రమణ, సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ మాట్లాడారు. అంగన్వాడీలు 19 రోజులుగా సమ్మె చేస్తుంటే ప్రభుత్వం సమస్యలు పరిష్కరించేశామని చెప్పడం, తప్పుడు ఆరోపణలు చేయడం మానుకోవాలని డిమాండ్‌ చేశారు. తామేమీ అదనంగా కోరడం లేదని, ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతున్నామని అన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెస్‌ ఛార్జీలు ఇవ్వడంలేదని అన్నారు. అంగన్వాడీలకు ఇస్తున్న గౌరవ వేతనం పిల్లలకు పెట్టాల్సి వస్తుందన్నారు. సేవాభావంతో పని చేస్తున్న తమ గురించి ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం కనీస వేతనాలు అమలు చేయాలన్నారు. ఎవరూ లేనప్పుడు కేంద్రాల తాళాలు పగుల కొట్టించిన మీరు బొత్స ఇంటికి వెళ్లేందుకు అడ్డుకునే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. తమ సమస్యలు పరిష్కరించకపోతే గత ప్రభుత్వాలకు పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. ముట్టడి కార్యక్రమంలో సిఐటియు నాయకులు బి.సూర్య నారాయణ, యుఎస్‌ రవికుమార్‌, బి.రమణ, మాణిక్యం, శ్యామల, కృష్ణమ్మ వెలాదిగా తరలి వచ్చిన అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.

రామభద్రపురం : స్థానిక ఆర్‌టిసి కాంప్లెక్స్‌ ఎదురుగా రహదారిపై సిఐటియు మండల కార్యదర్శి బి.శ్రీనివాసరావు ఆధ్వర్యాన అంగన్వాడీలు మానవహారం చేపట్టి, రాస్తారోకో నిర్వహించారు. దీంతో ఇరువైపులా భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది పోలీసులు అక్కడికి చేరుకుని, అంగన్వాడీలకు సర్దిచెప్పి, ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.

బొబ్బిలి : ఎన్నికల హామీలను అమలు చేయాలని కోరుతూ ఆర్‌టిసి కాంప్లెక్స్‌ కూడలిలో అంగన్వాడీలు మానవహారం చేసి నిరసన తెలిపారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు పి.శంకరరావు, అంగన్వాడీ యూనియన్‌ నాయకులు నిర్మల, కామేశ్వరి, రోజా, ప్రసన్నలక్ష్మి పాల్గొన్నారు.

➡️