కనువిప్పు కలిగేనా?

Feb 17,2024 20:28

ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి : అధికార, ప్రతిపక్షాలకు ఇప్పటికైనా కనువిప్పు కలిగేనా? రాష్ట్రానికి నమ్మకద్రోహం చేసిన బిజెపికి దూరంగా ఉండేనా? అన్న చర్చ గడిచిన నాలుగు రోజులుగా జిల్లా వ్యాప్తంగా సాగుతోంది. ఇందుకు కారణం లేకపోలేదు. ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇటీవల టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లి బిజెపి పెద్దలతో మంతనాలు జరిపిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో పొత్తు కుదుర్చుకునేందుకే బాబు ఢిల్లీ వెళ్లారనే చర్చ సర్వత్రా సాగుతోంది. చంద్రబాబు మౌనం వహించడం ద్వారా జనం విమర్శల్ని అంగీకరించినట్లయింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి విజయనగరం జిల్లాకు చెందిన కేంద్ర మాజీ మంత్రి, సీనియర్‌ రాజకీయ నేత వైరిచర్ల కిశోర్‌ చంద్రదేవ్‌ ఇటీవల టిడిపి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన విషయం విదితమే. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడంతో పాటు మతోన్మాద బీభత్స పాలనకు తెరలేపడం ద్వారా ఓటు బ్యాంకు సృష్టించుకోవడమే లక్ష్యంగా ఎన్‌డిఎ ప్రభుత్వం పనిచేస్తోందని, అటువంటి బిజెపితో టిడిపి చెలిమి చేయడం రాష్ట్రానికి ఏమాత్రమూ శ్రేయస్కరం కాదని, అందువల్లే తన సభ్యత్వాన్ని రద్దు చేసుకోదలచుకున్నానని రాజీనామా లేఖలో పేర్కొన్నారు. దీన్నిబట్టి రాష్ట్రానికి బిజెపి ఎంత ద్రోహం చేసిందో వేరేగా చెప్పనక్కర్లేదు. దేశం, రాష్ట్రంతోపాటు ఉత్తరాంధ్ర, అందులోనూ ఉమ్మడి విజయనగరం జిల్లాకు బిజెపి పాలనలో చాలా అన్యాయమే జరిగింది. పదేళ్ల క్రితం నాటి గిరిజన వర్సిటీ హామీ కలగానే మిగిలిపోయింది. ఆరేళ్ల ఆలస్యంగా వర్సిటీని ఏర్పాటు చేసినప్పటికీ సొంత భవన సముదాన్ని సమకూర్చలేదు. తొమ్మిదేళ్ల తరువాత.. అంటే, నాలుగు నెలల క్రితం కేంద్ర విద్యాశాఖ మంత్రి భూమి పూజ చేసేందుకు వచ్చినందుకు అధికార వైసిపి నాయకులు, సిఎం వైఎస్‌ జగన్మోహనరెడ్డి మురిసిపోయారు. అంతే తప్ప, ఇన్నాళ్లూ జరిగిన ఆలస్యంపై ప్రశ్నించలేదు. పైగా కేంద్రం ప్రవేశపెట్టిన ప్రజా వ్యతిరేక విధానాలన్నీ మరే రాష్ట్రంలోనూ అమలు చేయనంతగా మన ప్రభుత్వం అమలు చేసింది. దీని ఫలితమే విద్యుత్తు ఛార్జీలు, పెట్రోల్‌, డీజిల్‌, నిత్యావసర సరుకుల ధరలు, చెత్తపన్ను వంటివి. ఇంకా ఆలోచిస్తే, నూతన విద్యా విధానం పేరిట స్కూళ్లను కలిపేసి, లక్షలాది మంది పేద విద్యార్థులను సర్కారు బడులకు దూరం చేసింది. మరోవైపు పాఠ్యాంశాల్లో శాస్త్రీయతను చూపించే డార్విన్‌ సిద్ధాంతం సహా అనేక పాఠాలను రద్దుచేసింది. వాటి స్థానంలో కర్మ సిద్ధాంతం, మనవాదం, మూఢనమ్మకాలను పెంచిపోషించే అంశాలను చేర్చింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎలాగూ ఇవ్వలేదు. కనీసం వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీకి కూడా ముఖం చాటేసింది. దీంతో విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలు చాలా వెనుకబడిపోయాయి. ఇప్పటికీ ఏజెన్సీలో తగిన రహదారులు లేవు. బహుషా అందుకేనేమో మన్యం జిల్లాలో అక్షరాస్యతలో అట్టడుగు స్థానంలోకి వెళ్లింది. ఇప్పటికీ గిరిజన గ్రామాలకు రోడ్లు లేక రోగుల కోసం డోలిమోతలు తప్పడం లేదు. శృంగవరపుకోట మండలం మూలబొడ్డవర పంచాయతీ పరిధిలోని చిట్టెంపాడు గిరిజన గ్రామానికి చెందిన తల్లీబిడ్డ మరణం ఇందుకు మచ్చుతునకగా చెప్పుకోవచ్చు. ఉద్యోగాల ఆశచూపి వరుసగా రెండు సార్లు గద్దెనెక్కిన బిజెపి ప్రభుత్వం మాట నిలబెట్టుకోక పోవడంతో నిరుద్యోగం తాండవిస్తోంది. కూలి పనుల కోసం విదేశాలకు పోవాల్సిన దుస్థితీ దాపురించింది. నల్లధనం వెలికితీత పేరిట కరెన్సీ నోట్ల రద్దు వల్ల మన జిల్లా ఇప్పటికీ ఆర్థికంగా తేరుకోలేదు. అంతేకాదు, విద్య, వైద్యం వంటి కనీస అవసరాలు తీర్చేందుకు కూడా సహకరించని కేంద్ర ప్రభుత్వం.. సందు దొరికితే కులం, మతం, ప్రాంతీయ విభేదాలు సృష్టించడం ద్వారా రాజకీయ మనుగడ సాగించేందుకు బరితెగించింది. ఈ క్రమంలో రాజ్యాంగ మూలాలు దెబ్బతింటున్నాయి. సామాన్యులకు రక్షణ కొరవడింది. ఇటువంటి తరుణంలో ఇవే అంశాలను తప్పుగా ఎత్తిచూపుతూ కిశోర్‌ చంద్రదేవ్‌ టిడిపికి రాజీనామా చేయడం చర్చనీయాంశమే అయింది. ప్రజా దృక్కోణం గల మేధావులు కిశోర్‌ వైఖరిని సమర్థిస్తున్నారు.

➡️