కబ్జా దారుల నుంచి మా భూములు కాపాడండి

Dec 1,2023 20:14

  ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌  :  భోగాపురం మండలం పోలిపల్లి గ్రామానికి ఆనుకొని సర్వే 27 లో ఉన్న తమ భూములను తమకు అప్పగించాలని అమనాం గ్రామానికి చెందిన తిరుమల రెడ్డి వెంకటరావు, తామడ గౌరీ కోరారు. శుక్రవారం ఎస్‌పికి ఫిర్యాదు చేసేందుకు జిల్లా పోలీసు కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ పొలిపల్లి గ్రామానికి ఆనుకొని ఉన్న సర్వే నెంబర్‌ 27లో సుమారుగా 45 నుంచి 50 ఎకరాల భూమి తమ కుటుంబ సభ్యులకు, తమకు ఉందన్నారు. ఈ భూమి రికార్డులను తారుమారు చేసి భూమిని కొల్లగొట్టేందుకు కొంతమంది పెద్దలు రాజకీయ అండతో ప్రయత్నిస్తున్నారని తెలిపారు. పోలిపల్లి మాజీ సర్పంచ్‌ కర్రోతు సత్యన్నారాయణ సహకారంతో తప్పుడు డాక్యుమెంట్లు రూపొందించి కబ్జా చేసేందుకు చూస్తున్నారన్నారు. ఇదే విషయంపై తమ వద్ద నున్న పక్కా ఆధారాలతో కోర్టు కెళ్లామని తెలిపారు. తప్పుడు ఆధారాలతో ఆక్రమించుకున్న వారిపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించిందని తెలిపారు. ఇవేవీ పట్టించుకోకుండా కర్రోతు సత్యన్నారాయణ సుమారుగా మూడు ఎకరాలు భూమిలో అక్రమ కట్టడాలను పాల్పడుతున్నారని ఆరోపించారు. వెంటనే ఎస్‌పి కలుగజేసుకొని తమకు న్యాయం చేయాలని కోరారు. వీరితో పాటు సర్వే నెంబర్‌ 27 లో భూములున్న కుటుంబాలు కూడా ఎస్‌పిని కలిశాయి.

➡️