‘కమిటీ దృష్టికి ఎస్‌సి, ఎస్‌టిల సమస్యలు’

ప్రజాశక్తి-పీలేరు ఎస్‌సి, ఎస్‌టి గ్రామాల్లో ప్రజల సమస్యలు పరిష్కరించి వారికి తగిన సౌకర్యాలు సమకూర్చాలని ప్రజాసంఘాల నాయకులు పేర్కొన్నారు. బుధవారం స్థానిక ఎంపిడఒ కార్యాలయంలో తహశీల్దార్‌ ధనుంజరు అధ్యక్షతన ఎస్‌సి, ఎస్‌టి విజిలెన్స్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ సమావేశం నిర్వ హించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎంపిపి కంభం సతీష్‌ కుమార్‌రెడ్డి, ప్రభుత్వ ఆస్పత్రి మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ పి.చంద్ర శేఖర్‌, సిఐ మోహన్‌ రెడ్డి, వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా భారతీయ అంబేద్కర్‌ సేన నాయకులు పాలకుంట శ్రీనివాసులు, ఎంఆర్‌పిఎస్‌ నాయకులు నడిమి కండ్రిగసుధాకర్‌, మాల మహానాడు రాష్ట్ర నాయకులు ధరణికుమార్‌, మహిళా నాయకులు రాజమ్మలు మాట్లాడుతూ దళితుల సమస్యలను అధికారుల దష్టికి తీసుకువచ్చారు. పీలేరు మండలం, ముడుపులవేముల పంచాయతీ, విద్యానగర్‌కు చెందిన దళిత ప్రజలు సర్వే నంబర్‌ 404 లోని ప్రభుత్వ భూమిలోఎన్నో దశాబ్దాలుగా పసలమంద వేసి సంక్రాంతి పండుగ జరుపుకునే వారిని, ప్రస్తుతం ఆ స్థలాన్ని ఓ వ్యక్తి కబ్జా చేసి, దళిత ప్రజలను ఇబ్బందులపాలు చేస్తున్నాడన్నారు. పీలేరులో అంబేద్కర్‌ భవనానికి స్థలం కేటాయించాలని పలుమార్లు వినతి పత్రాలు ఇచ్చినా అధికా రుల నుంచి ఎలాంటి స్పందన రాలేదని, ఇప్పటికైనా అంబేద్కర్‌ భవనానికి స్థలం చూపించాలని కోరారు. ముడుపులవేముల పంచాయతీ, విద్యానగర్‌ ఎస్‌సి కాలనీకి శ్మశాన వాటిక లేక ప్రజలు చాలా ఇబ్బందులకు గురవు తున్నారన్నారు. మండలానికి 15వ ఆర్థిక సంఘం నిధుల క్రింద ఎంత నిధులు మంజూరు అయ్యిందో వాటి వివరాలు సంబంధిత అధికారులు తెలపాలని కోరారు. మహిళలు మరుగుదొడ్ల సౌకర్యం లేక అనేక ఇబ్బందులను ఎదుర్కొం టున్నారని ఎంపిపి కంభం సతీష్‌ కుమార్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు.

➡️