కళలకు సరిహద్దులు లేవు

ప్రజాశక్తి – ఎఎన్‌యు : కళాకారులకు, కళలకు సరిహద్దులు ఉండవని, భాష ఏదైనా వారి భావంతోనే అన్ని ప్రాంతాలను వారి సొంతం చేసుకుంటారని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్‌ పి.రాజశేఖర్‌ అన్నారు. వర్సిటీ వేదికగా రెండు రోజులుగా జరుగుతున్న ఆల్‌ ఇండియా ఫైన్‌ ఆర్ట్స్‌ ఫెస్ట్‌, నేషనల్‌ ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ 2023 శనివారంతో ముగిసింది. కార్యక్రమానికి స్కూల్‌ ఆఫ్‌ పెర్ఫార్మింగ్‌ ఆర్ట్స్‌ కో-ఆర్డినేటర్‌ డాక్టర్‌ జి.అనిత అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న విసి మాట్లాడుతూ కళాకారులు సాధ్యమైనంత ఎక్కువ బాషల యందు ప్రావీణ్యం పొందాలని సూచించారు. కళలకు ప్రాంతాల మధ్య, భాషల మధ్య అంతరాలు ఉండవన్నారు. అన్ని రంగాలలో కెల్లా కళా రంగానికి ప్రత్యేకమైన స్థానం ఉంటుందని, తన చిన్నతనంలో కళా రంగం పట్ల ఆసక్తి ఉండేదని ప్రస్తుతం తన పిల్లలు కళా రంగంలో ప్రావీణ్యం పొందారని చెప్పారు. ఏడాది క్రితం ప్రారంభించిన స్కూల్‌ ఆఫ్‌ పెర్ఫార్మింగ్‌ ఆర్ట్స్‌ ఎంతో వృద్ధి సాధించిందన్నారు. రెండు రోజులుగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో తమిళనాడు, కేరళ, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల విద్యార్థులు పాల్గొని విజయవంతం చేయటం సంతోషంగా ఉందన్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో రానున్న ఆరు నెలల కాలంలో తమిళం, కన్నడం, మలయాళం, యూరోపియన్‌ భాషలను నేర్పే విధంగా డిప్లమా కోర్సులు ప్రారంభిస్తామని ప్రకటించారు. ఆంధ్ర యూనివర్సిటీలో కల్చరల్‌ సెంటర్‌ తిరిగి ప్రారంభమైందని, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం కూడా కళలకు నిలయంగా మార్చేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని స్పష్టం చేశారు. అనంతరం ఫెస్ట్‌లో పాల్గొన్న వివిధ రాష్ట్రాల విద్యార్థులకు సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. ఇదిలా ఉండగా ఫైన్‌ ఆర్ట్స్‌ విభాగంలో ప్రస్తుతం ఆర్టిస్టులుగా ఉన్న వారి కోసం ఈవినింగ్‌ కళాశాలను ఏర్పాటు చేయాలని కేరళకు చెందిన విద్యార్థులు వీసీని కోరారు. కార్యక్రమంలో రెక్టర్‌ ప్రొఫెసర్‌ పి.వరప్రసాద్‌ మూర్తి, రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ బి.కరుణ, ఆర్ట్స్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ సిహెచ్‌. స్వరూపారాణి, ఇంజనీరింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ పి.సిద్దయ్య, దూరవిద్య కేంద్రం డైరెక్టర్‌, నూట అధ్యక్షుడు డాక్టర్‌ బి.నాగరాజు, ఫైన్‌ ఆర్ట్స్‌ విభాగం అసిస్టెంట్‌ కోఆర్డినేటర్‌ బి.శేఖర్‌బాబు, అధ్యాపకులు బి.జాన్‌ రత్నబాబు తదితరులు పాల్గొన్నారు.

➡️