కళా, నాగార్జునకు టిక్కెట్‌ ఖరారులో జాప్యంపై టిడిపి నాయకుల నిరసన

Mar 15,2024 20:08

 ప్రజాశక్తి-రేగిడి :  ఉత్తరాంధ్ర జిల్లాల్లో అత్యధికంగా ఉన్న తూర్పు కాపు సామాజిక వర్గానికి ముఖ్యనేత అయిన టిడిపి సీనియర్‌ నాయకులు కిమిడి క ళా వెంకటరావుకు, కిమిడి నాగార్జునకు రెండో విడత కూడా టిక్కెట్లు కేటాయించకపోవడం పట్ల రాజాం నియోజకవర్గ నాయకులు నిరసన తెలిపారు. శుక్రవారం రాజాంలోని సూర్యదుర్గ కల్యాణ మండపంలో రాజాం, సంతకవిటి, రేగిడి, వంగర మండలాలకు చెందిన టిడిపి నాయకులు పైల వెంకటరమణ, ఉదయాన మురళి, టంకాల గోవిందరావు, వెంకటేష్‌, కేశవరావునాయుడు, న్యాయవాది వైవి రమణ, కరణం ఢిల్లీశ్వరరావుతో పాటు పలువురు సమావేశం నిర్వహించారు. ఎచ్చెర్ల నియోజవర్గంలో కళా వెంకటరావును, చీపురుపల్లిలో కిమిడి నాగార్జునను అభ్యర్థులుగా ప్రకటించకపోవడం పట్ల వీరంతా నిరసన తెలిపారు. అధిష్టానం నుంచి ఎన్నడూ లేని విధంగా ముఖ్య నాయకుడు, పొలిట్‌బ్యూరో సభ్యులైన కళాకు టిక్కెట్‌ ఖరారు చేయకపోవడం సరైనది కాదని అన్నారు. ఇది రాజకీయాల్లో తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. కీలక నాయకులకు, పొలిట్‌బ్యూరో సభ్యులకు ఇటువంటి పరిస్థితి రావడం ప్రజల్లో తప్పుడు సంకేతాలకు తావిస్తుందని అన్నారు. ఇప్పటివరకు విడదుల చేసిన జాబితాల్లో తూర్పు కాపులకు న్యాయం జరగలేదని అన్నారు. కళా వెంకరావు పట్ల చంద్రబాబు వైఖరి సమంజసంగా లేదని ఆవేదన చెందారు. వెంటనే చంద్రబాబు స్పందించి ఎచ్చెర్లలో కళా వెంకటరావు, చీపురుపల్లిలో నాగార్జున పేర్లను అభ్యర్థులుగా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు.

➡️