కాంగ్రెస్‌లోకి పాస్టర్స్‌ యూనియన్‌ నాయకులు

ప్రజాశక్తి-కొనకనమిట్ల: కొనకనమిట్ల మండల పాస్టర్స్‌ సువార్తికుల యూనియన్‌ అధ్యక్షుడు నిశనం ఇమ్మానియేల్‌ ఆధ్వర్యంలో యూనియన్‌కు సంబంధించిన నూతన కార్యవర్గం మొత్తం 13 మంది కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. కాంగ్రెస్‌ పార్టీ మార్కాపురం నియోజకవర్గ బాధ్యులు షేక్‌ సైదా సారథ్యంలో మార్కాపురం ప్రెస్‌క్లబ్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర మీడియా కమిటీ చైర్మన్‌, మాజీ రాజ్యసభ సభ్యులు డాక్టర్‌ ఎన్‌ తులసిరెడ్డి పార్టీ కండువాలు వేసి వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ ఎన్‌ తులసిరెడ్డి, షేక్‌ సైదా మాట్లాడుతూ దళితులు, బడుగు బలహీన వర్గాలు, మైనార్టీలకు కాంగ్రెస్‌ పార్టీ అనాదిగా అండదండలందిస్తూ వారి సంక్షేమానికి, వారి పురోభివృద్ధికీ పాటుపడు తోందని అన్నారు. బిజెపి, టిడిపి, జనసేన పార్టీలు బడుగు, బలహీన వర్గాల వ్యతిరేక పార్టీలని వారన్నారు. ప్రధానమంత్రి మణిపూర్‌ మారణ హౌమాన్ని ఆపలేని అసమర్థుడు అని వారు విమర్శిం చారు. దేశంలో, రాష్ట్రంలో దళితులు, మైనార్టీల మీద దాడులు ఎక్కువయ్యాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికలలో సువార్తికులు అందరూ కాంగ్రెస్‌ పార్టీకి ఓట్లు వేసి గెలిపించాలని వారు కోరారు. పాస్టర్‌ యూనియన్‌ అధ్యక్షులు నిశనం ఇమ్మానియేల్‌ మాట్లాడుతూ తమ యూనియన్‌లో 150 మంది సభ్యులు ఉన్నారని, తామందరం సమైక్యంగా రానున్న రోజుల్లో కాంగ్రెస్‌ పార్టీకి అండగా నిలబడతామని అన్నారు. ఈ కార్య క్రమంలో యూనియన్‌ అధ్యక్షులు నిశనం ఇమ్మానియేల్‌, ఉపాధ్యక్షులు సిహెచ్‌ ఆనంద రావు, కార్యదర్శి గొంగటి రాజేశ్వరరావు, జాయింట్‌ సెక్రెటరీ పలపాటి రాజు, కోశాధికారి గొంగటి లాబాను, కార్యవర్గ సభ్యులు కోలా రూబేను, పొలపాటి మార్కు, గుంటి బాల యేసు, పొట్లూరి తిమోతి, జి డానియల్‌, నిశనం గురవయ్య, విడుదల ఇర్మియా, యద్దన పూడి ఇస్సాకు తదితరులు పార్టీలో చేరారు.

➡️