కానరాని సర్వేలు

మిచౌంగ్‌ తుపాను వల్ల కలిగిన పంట నష్టాన్ని అంచనా వేయడంలో వ్యవసాయశాఖ అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారు. తుపాను తీరం దాటి ఐదు రోజులు కావస్తున్నా ఇంత వరకూ క్షేత్రస్థాయిలోకి వెళ్లి పంట నష్టాలను అంచనా వేయకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వాస్తవానికి తుపాను సమయంలో పంట నష్టం వేస్తేనే నష్టం తీవ్రత కనిపించే పరిస్థితి ఉంది. కానీ అధికారులు ఐదు రోజులు దాటిన ఇంకా పొలాల్లోకి దిగకపోవడంతో సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. పంట నష్టాన్ని అంచనా వేయడానికి కూడా మహూర్తం చూస్తున్నట్లు తెలిస్తోంది. పంట పోయి దుక్కంలో ఉన్న రైతులను ఓదర్చడానికైనా పొలంలోకి వస్తారేమోనని ఆశగా చూస్తున్న రైతుకు నిరాశే మిగులుతోంది. పైగా ప్రభుత్వం కూడా పంట నష్ట పరిహారాన్ని ప్రకటించకుండా దోబూచులాడటం రైతును మరింత ఆగ్రహానికి గురి చేస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే అధికారులను క్షేత్ర స్థాయి పరిశీలనకు పంపించాలని, తమను ఆదుకోవాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.

ప్రజాశక్తి – నెల్లిమర్ల : ఇటీవల మిచౌంగ్‌ తుపాను దాటికి మండలంలో 490 ఎకరాల్లో పంటనష్టం జరిగినట్లు రైతులు అంచనా వేస్తున్నారు. ఇంత వరకు రైతు వారీగా ఎంత పంట నష్టం జరిగిందనేది లెక్కలు తేల్చలేదు. దీంతో ఆయా రైతులు ఏమీ చేయలేని స్థితిలో కొట్టు మిట్టడుతున్నారు. సతివాడలో 20 ఎకరాల్లో పత్తి పంట నష్టం జరిగిందని గుర్తించారు. కాగా అధికార్లు, ప్రజాప్రతినిధులు హడావిడిగా వచ్చి తడిచిన పంటలను పరిశీలించినా రైతులను ఆదుకోనే పరిస్థితి కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తడిసిపోయిన వరిపంటను రక్షించు కోవడానికి పొలంలోకి వెళ్లి ఆరబెట్టుకోవడం తప్ప తమను ఆదుకొనే నాధుడు లేడని వాపోతున్నారు. ఆరుగాలం కష్టపడి విత్తనాల పోత నుంచి పంట కోత వరకు పెట్టుబడికి వెనక్కు తగ్గకుండా వరి సాగు చేస్తే వర్షాలు కురవక ఎన్నో ఇబ్బందులు పడి పొట్ట దశలో ఉన్న పంటకు యంత్రాలతో నీరందించి చివర కోత కోసే సమయంలో తుపాను కారణంగా అకాల వర్షాలు కురిసి చేతికి అంది వస్తుందనుకున్న వరి పంట నీట మునిగి తిండి గింజలు కూడా దక్కకుండా పోయిందని చెబుతున్నారు. ప్రభుత్వం ఆదుకుంటుందని ఆశగా ఎదురు చూస్తున్న రైతుకి తుపాను పోయి వారం రోజులు గడుస్తున్నా ఇప్పటికీ రైతు వారీగా పంట నష్టం గుర్తించకపోవడం దారుణమని చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులు వెంటనే స్పందించి పంట నష్టం గుర్తించి రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు.పొలంలోని పంట కల్లాలకు తరలింపు..వేపాడ: ఇటీవల కురిసిన వర్షాలు వల్ల పొలాల్లో కుప్పలుగా పెట్టిన వరి, కోసి ఉంచిన వరి పూర్తిగా తడిచిపోయిన విషయం తెలిసిందే. గత రెండు రోజులుగా కాస్త ఎండలు కాయడంతో తడిచిన వరిని చాలా మంది రైతులు ఆరబెట్టుకునే పనిలో నిమగమయ్యారు. మరి కొంత మంది ఆరబెట్టిన వరిని కళ్లాలకు తరలించుకునేందుకు తంటాలు పడుతున్నారు. వరిని కళ్లాలకు తరలించాలంటు పొలంలోకి దిగాల్సి వస్తుంది అలా దిగిలాంటే ఇప్పటికే నానిపోయి పొలం దిగబడి పోతుంది. దీంతో ఏదోలా పొలంలో దిగిన రైతు రోడ్డు వరకూ తలపై పెట్టి మోసుకుని వచ్చి రోడ్డుపై ట్రాక్టర్‌కు అందిస్తున్నారు. దీంతో రైతుకు ఖర్చు తడిసిమోపెడవుతోంది. మరి కొంతమంది నీటిలో మునిగి ఉన్న వరి కుప్పలను ఒడ్డుకు చేర్చలేక, చేతికి అందిన పంటను వదులుకోలేక మల్లగుల్లాలు పడుతున్నారు. వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి చేతికందే సమయానికి వర్షాలు పడటంతో అప్పులు పాలవుతున్నామని రైతులు వాపోతున్నారు. ఆదివారం మండలంలోని వల్లంపూడి తదితర గ్రామాల్లో వరిని మోపులు కట్టి రోడ్డుకు చేర్చి అక్కడి నుంచి ట్రాక్టర్ల ద్వారా కళ్లాలకు చేరిస్తూ రైతులు కనిపించారు. ఐదు రోజులు కావస్తున్నా సర్వే లేదు : సిపిఎం శృంగవరపుకోట: తుపాను తీరం దాటి ఐదు రోజులు కావస్తున్నా పంట నష్టాన్ని పరిశీలించి నష్టపోయిన రైతుల జాబితాను సర్వే చేసి రూపొందించే జాడలు ఎక్కడ కానా రావటం లేదని సిపిఎం మండల కార్యదర్శి మద్దిల రమణ ఆరోపించారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ మండలంలోని సుమారు 2,500 ఎకరాల్లో తుపాను కారణంగా వరి పంట దెబ్బతిందని వెంకటరమణ పేట, తిమిడి, వసి, కొత్తూరు పెదకండేపల్లి మొదలగు చోట్ల ధాన్యం మొలకలు వచ్చాయని, మొలకలు వచ్చిన ధాన్యానికి ప్రభుత్వం మద్దతు ధర నిర్ణయించలేదని చెప్పారు. ఇప్పటి వరకు ప్రభుత్వం కాలయాపన చేస్తుంది తప్ప రైతులకు ఎక్కడా ఆదుకున్న దాఖలాలు లేవని ఆయన విమర్శించారు. పంట నష్టాన్ని సర్వే చేసి రైతులను గుర్తించి వెంటనే వారికి నష్టపరిహారాన్ని చెల్లించాలని మొలకెత్తిన ధాన్యానికి మద్దతు ధర ప్రకటించి రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తున్నామని లేని పక్షంలో రైతులతో కలిసి పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధమవుతామని ఆయన హెచ్చరించారు.నష్టపరిహారం ప్రకటించాలిగజపతినగరం: తుపాను వల్ల రైతులు తీవ్రంగా పంటలను నష్టపోయారని వెంటనే వారికి నష్టపరిహారం చెల్లించాలని ఎపి రైతు సంఘం మండల కన్వీనర్‌ దాసరి సింహద్రి, ఎపి కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి రాకోటి రాములు ఆదివారం ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. ఏ పొలంలో చూసినా వరి ముంపునకు గురై కనిపించిందని, వర్షాలు తగ్గినా కుప్పలు కింద తడి ఆరకపోవడంతో మొలకలు వచ్చేశాయని రెవెన్యూ, వ్యవసాయ శాఖలు సంయుక్తంగా సర్వే చేసి పంట నష్టాన్ని గుర్తించి రైతుకు న్యాయం చేయాలని కోరారు. పంట చేతికి వచ్చే సమయంలో నష్టపోయారు కాబట్టి ఎకరాకు రూ. 50వేలు పరిహారం ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. ధాన్యం కళాసీల ఛార్జీలను పూర్తి స్థాయిలో విడుదల చేయాలని కోరారు.

➡️