కాల్వల్లో వ్యర్థాల మేట

Feb 7,2024 00:06

విస్సార్‌ కళాశాల రోడ్డు వెంట కాలువల్లో వ్యర్ధాలు
ప్రజాశక్తి-తెనాలి : కృష్ణా పశ్చిమ డెల్టా పరిధిలో ముచ్చటగా ప్రవహించే మూడు కాల్వలు వ్యర్ధాలతో నిండి పోతున్నాయి. కూరగాయలు, మాంసం, చేపల మార్కెట్ల నుంచి వెలువడే వ్యర్ధాలకు తోడు కాల్వ అంచున ఉన్న రోడ్లలో నిర్వహించే వ్యాపార కూడళ్ల వ్యర్ధాలు కూడా కాల్వల్లోకి చేరుతున్నాయి. క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌, స్వచ్ఛతెనాలి, స్వచ్ఛసర్వేక్షణ్‌ ఇలా ఎన్ని కార్యక్రమాలు నిర్వహించినా పట్టణంలో కొన్నిచోట్ల పరిస్థితిలో మార్పు రావటంలేదు. తెనాలి పట్టణంలోంచి ప్రవహించే ఈ మూడు కాల్వల ద్వారా కృష్ణా డెల్టా ప్రాంతంలోని చివరి ప్రాంతాలకు సాగు, తాగునీటి అవసరాలకు ఈ నీటినే ఉపయోగిస్తారు. తాగునీరు కలుషితమైతే ఎంత ప్రమాదమో తెలియంది కాదు. కాల్వల్లో చేరుతున్న వ్యర్థాలు దిగువ ప్రాంతాల వారి తాగునీటి అవసరాలకూ విఘాతమే. తెనాలి పట్టణం మధ్యగా మూడు కాల్వలు ప్రవహిస్తుంటాయి. వీటిని తూర్పు, పడమర, మధ్య (నిజాంపట్నం) కాల్వలుగా పిలుస్తారు. కృష్ణా పశ్చిమ డెల్టా పరిధిలో సాగు, తాగు నీటి అవసరాలకు ఈ కాల్వలే ఆధారం. గుంటూరు, బాపట్ల జిల్లాలతో పాటు ప్రకాశం జిల్లాలో కూడా ఈ కాల్వలు విస్తరించి ఉన్నాయి. ఈ కాలువల ద్వారా కృష్టా పశ్చిమ డెల్టా పరిధిలో ఉన్న దాదాపు ఐదులక్షల ఎకరాలు సాగు నీరు అందుతుంది. అదే విధంగా దిగువ ప్రాంతాల్లో కొంత మేర ఇదే నీటి ద్వారా చెరువులు నింపుకుని, తాగునీటి అవసరాలకు ఉపయోగిస్తుంటారు. ఈ నేపథ్యంలో కాల్వల్లో వ్యర్థాలను వేయరాదంటూ పురపాలక సంఘం ఆధ్వర్యంలో క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌, స్వచ్ఛ తెనాలి, స్వచ్ఛ సర్వేక్షణ్‌ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నారు. వ్యాపార కూడళ్లు, గృహ సముదాయాలు, ఇతర సంస్థల నుంచి వెలువడే వ్యర్థాలకు డస్ట్‌ బిన్టు ఉపయోగించాలని, వ్యర్ధాలను చెత్త సేకరణ వాహనాలకు అందించాలని నిత్యం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కాల్వల్లో వ్యర్ధాలను వేయటం ద్వారా అవి పూడికుపోయి, మురుగనీటి పారుదలకు విఘాతం కలిగిస్తాయని, తద్వారా అనేక పరిణామాలు ఎదురౌతాయని హెచ్చరిస్తూనే ఉన్నా పట్టణంలోని కొన్ని ప్రాంతాల్లో మార్పేమీ రావడం లేదు.కాల్వల్లో మేట వేస్తున్న వ్యర్ధాలుతూర్పు, పడమర, మధ్య కాల్వల వెంట ఉన్న రోడ్లలో టిఫిన్‌ సెంటర్లు, టీస్టాల్స్‌, ఇతర వ్యాపార కూడళ్లు నిర్వహిస్తున్నారు. దీనికి తోడు కూరగాయలు, మాసం, చేపల మార్కెట్లు, కాల్వల వెంట నిర్వహించే వ్యాపార కూడళ్ల నుంచి వెలువడే వ్యర్థాలను కాల్వల్లో పడేస్తున్నారు. మార్కెట్‌లో కుళ్లిపోయిన కూరగాయ వ్యర్ధాలు, మాసం, చేపల మార్కెట్ల నుంచి వెలువడే వ్యర్థాలను అధికశాతం కాల్వల్లో పడేస్తున్నారు. ప్రధానంగా తూర్పు కాలువలో వ్యర్ధాలు మేట వేస్తున్నాయి. పట్టణంలో తెనాలి-విజయవాడ రోడ్డులో బస్టాండ్‌ నుంచి పెట్రోల్‌ బంకు వరకూ చేపల విక్రయాలు విరివిగా నిర్వహిస్తున్నారు. ఈ వ్యర్ధాలను కూడా తూర్పు, మధ్య కాల్వల్లోనే పడేస్తున్నారు. కాల్వల్లో ప్రస్తుత నీటి ప్రవాహం తక్కువగా ఉన్న నేపథ్యంలో చెత్త గుట్టలు గుట్టలుగా కనిపిస్తోంది. అదే కాల్వలు నిండుగా ప్రవహిస్తున్న తరుణంలో అవి కనిపించే అవకాశం కూడా ఉండదు. సాగుకు నీరు విడుదల చేసినా దిగువ ప్రాంతానికి నీరు వెళ్లేందుకు ఈ వ్యర్ధాలు అడ్డంకిగానే ఉంటాయి. దిగువ ప్రాంతం వారు తాగునీటికి కూడా ఉపయోగిస్తున్న నేపథ్యంలో నీటి కాలుష్యాన్ని అరికట్టాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. ఇప్పటికైనా కాల్వల్లో మేట వేసిన వ్యర్ధాల తొలగింపునకు, తాగునీటి కాలుష్యాన్ని నివారించేందుకు అధికారులు పటష్ట చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

➡️