కుంభవృష్టి..!

ప్రజాశక్తి – ఏలూరు ప్రతినిధి

మిచౌంగ్‌ తుపాను ప్రభావంతో కురుస్తున్న వర్షాలు జిల్లాను ముంచెత్తాయి. 24 గంటల పాటు ఆకాశానికి చిల్లుపడిందా అన్నట్లు కుంభవృష్టి వర్షం కురిసింది. జిల్లావ్యాప్తంగా సరాసరిన 37.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జిల్లాకేంద్ర ప్రభుత్వాసుపత్రి నీటమునిగింది. లక్షలాది ఎకరాల్లో పంటలకు ముప్పు ఏర్పడింది. ధాన్యపురాశులు తడిసిముద్దయ్యాయి. వరి, మొక్కజొన్న, పత్తి, పొగాకు పంటలు నేలకొరిగాయి. కోతలు పూర్తయిన వరి పనలు నీటిలో తేలియాడుతున్నాయి. నారుమడుల్లోకి మోకాళ్లలోతు నీరు చేరింది. చేతికొచ్చిన పంటలు దెబ్బతినడంతో అన్నదాతలు కన్నీరుపెడుతున్నారు.మిచౌంగ్‌ తుపాను జిల్లాను నిండాముంచేసింది. సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం సాయంత్రం వరకూ జిల్లావ్యాప్తంగా కుంభవృష్టి వర్షం కురిసింది. సరాసరిన 37.9 మిల్లీమీటర్ల వర్షం నమోదైంది. అత్యధికంగా ముదినేపల్లిలో 135.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జనం ఇంటినుంచి అడుగుబయట పెట్టే పరిస్థితి లేకుండాపోయింది. జనజీవనం స్తంభించింది. ముఖ్యంగా రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. జిల్లావ్యాప్తంగా 1.93 లక్షల ఎకరాల్లో రైతులు వరిసాగుచేయగా ఇప్పటి వరకూ 90 వేల ఎకరాల్లో మాత్రమే మాసూళు ్ల పూర్తయ్యాయి. లక్ష ఎకరాల్లో పంట పొలాల్లోనే ఉండిపోయింది. ఎడతెరిపిలేని వర్షానికి లక్ష ఎకరాల్లో పంటకు ముప్పు ఏర్పడింది. పొలాల్లో మోకాళ్లలోతు నీళ్లు నిలిచాయి. ఈదురుగాలులకు పలుచోట్ల పంటలు నేలకొరిగాయి. కోతకోసిన వరి పనలు నీటిలో తేలియాడుతున్నాయి. రోడ్లపైన, కల్లాలో ఉన్న ధాన్యపురాశులు తడిసిముద్దయ్యాయి. ధాన్యం మొలకలు వచ్చే పరిస్థితి ఏర్పడింది. మెట్టప్రాంతమైన జీలుగుమిల్లి మండలంలో సైతం వరిపంటలు నీటమునిగాయి. ఇప్పటికే రైతులు ఎకరాకు రూ.35 వేలకుపైగా ఖర్చుచేశారు. ప్రస్తుత పరిస్థితి చూస్తే రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. చేతికొచ్చిన దక్కకుండా పోవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. బాపట్ల వద్ద తుపాను తీరం దాటినప్పటికీ మరో 48 గంటలపాటు తుపాను ప్రభావం ఉండనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. మరోవారంరోజుల వరకూ కోతలు కోసే పరిస్థితి కనిపించడంలేదు. దీంతో పంటంతా కుళ్లిపోయే ప్రమాదం ఉంది. మెట్ట ప్రాంతంలో పొగాకు పొలాల్లోకి భారీగా వర్షపు నీరు చేరింది. దాదాపు 20వేల ఎకరాల్లో పొగాకు సాగవుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. వర్షాలకు వేరుశనగ పంటకు సైతం తీవ్ర నష్టం వాటిల్లింది. కోసిన పంట తడిసిముద్దవడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు.జిల్లాలో వర్షపాతం ఇలా..జిల్లాలో 24 గంటల్లో వ్యవధిలో 37.9 మిలీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా మండవల్లి మండలంలో 135.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా కుక్కునూరులో 12 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ముదినేపల్లిలో 133.2, కలిదిండి 57.6, కైకలూరు 56.2, పెదపాడు 45.6, ఏలూరు 38.4, కొయ్యలగూడెం 36.8, భీమడోలు 34.2, పెదవేగి 33.8, దెందులూరు 32.6, జంగారెడ్డిగూడెం 31.8, ఆగిరిపల్లి 30.6, ఉంగుటూరు 30.2, నూజివీడు 30.2, నిడమర్రు 30, జీలుగుమిల్లి 29.6, ముసునూరు 29.4, చాట్రాయి 28.4, లింగపాలెం 25.8, టి.నరసాపురం 25.2, కామవరపుకోట 24.6, బుట్టాయగూడెం 22.0, ద్వారకాతిరుమల 20, పోలవరం 19.2, చింతలపూడి 18.4, వేలేరుపాడు మండలంలో 12 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.టార్పాలిన్లు లేక రైతుల అవస్థలువర్షానికి తడవకుండా ధాన్యపు రాశులను కాపాడుకునేందుకు రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం రైతులకు అవసరమైన టార్పాలిన్లు అందించడంలో విఫలమైంది. దీంతో ధాన్యపు రాశులపై ఎన్ని బరకాలు కప్పినప్పటికీ గింజలు తడిసిపోతున్నాయి. కంట్రోల్‌ రూములు ఏర్పాటుతుపాను నేపథ్యంలో పలు చర్యలు చేపట్టిన అధికారులు జిల్లా, డివిజన్‌, మండల కేంద్రాల్లో కంట్రోల్‌ రూములు ఏర్పాటు చేశారు. కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూం టోల్‌ ఫ్రీ నెంబర్‌ 18002331077, న్యూజివీడు సబ్‌కలెక్టర్‌ కార్యాలయం- 18656-232717, జంగారెడ్డిగూడెం ఆర్‌డిఒ కార్యాలయం – 9553220254 ఏలూరు ఆర్‌డిఒ కార్యాలయం – 8500667696నీట మునిగిన నారుమడులురబీ పంటకు సంబంధించి వేసిన నారుమడులు ఎక్కడికక్కడే నీటమునిగాయి. నిడమర్రు, ఉంగుటూరు, భీమడోలు వంటి పలు మండలాల్లో రైతులు నారుమడులు పెద్దఎత్తున వేశారు. వర్షానికి మోకాళ్ల లోతు నీళ్లు పొలాల్లోకి చేరాయి. దీంతో రెండోసారి నారుమడులు వేయాల్సిన పరిస్థితి ఏర్పడనుందని రైతులు లబోదిబోమంటున్నారు.పల్లపు ప్రాంతాలు జలమయంతుపాను ప్రభావంతో కురిసిన వర్షానికి పల్లపు ప్రాంతాలు, రోడ్లు జలమయమయ్యాయి. పలు కాలనీలు నీటమునిగి ఇళ్లల్లోకి నీరు చేరింది. జిల్లా కేంద్రం ఏలూరులో రోడ్లపై మోకాళ్లలోతు వర్షపునీరు నిలిచిపోవడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఏలూరు ప్రభుత్వాసుపత్రికిలో వర్షపునీరు చేరడంతో సిబ్బంది, రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

➡️