కూలీలకు పనులు కల్పించాలి : ఏపీడీ

ప్రజాశక్తి-టంగుటూరు గ్రామీణ ప్రాంతాల్లోని కూలీలు ఉపాధి హామీ పనులకు హాజరయ్యేలా అవగాహన కల్పించాలని ఎన్‌ఆర్‌ఇజిఎస్‌ అసిస్టెంట్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ పి.వెంకటస్వామి తెలిపారు. స్థానిక ఉపాధి హామీ పథకం కార్యాలయంలో మండల పరిధిలోని కారుమంచి, మర్లపాడు, కొణిజేడు, మల్లవరపుపాడు, ఎం.నిడమలూరు, కందులూరు గ్రామాలలోని ఉపాధి క్షేత్ర స్థాయి సిబ్బంది, మేట్లకు బుధవారం శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీడీ మాట్లాడుతూ కూలీలు పని చేసే ప్రాంతాల్లో కొలతల ప్రకారం పని చేయించడం కోసం మేట్లకు అవగాహన కల్పించారు. కూలీలందరినీ పనులకు హాజరుపరిచి కొలతల ప్రారం పని చేయించి వారు పూర్తి వేతనం పొందేలా చర్యలు తీసుకోవాలన్నారు. కూలీలకు పని ప్రాంతాల్లో తగిన సౌకర్యాలు కల్పించాలని మేట్లను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో టంగుటూరు ఎపిఒ ఎం.సుభాషిణి, ఉపాధిహామీ పథకం ఇసి, టిఎలు, క్షేత్ర స్థాయి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

➡️