కేంద్రం సహకారంతో రైల్వే సౌకర్యాల కల్పన

Mar 12,2024 21:23

 ప్రజాశక్తి-విజయనగరం కోట : విశాఖ – భువనేశ్వర్‌ మధ్య కొత్తగా ఏర్పాటు చేసిన వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలుకు స్థానిక రైల్వేస్టేషన్‌లో మంగళవారం ఘనస్వాగతం లభించింది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోది ఈ రైలును వర్చ్యువల్‌గా ప్రారంభించగా విశాఖ నుంచి విజయనగరం స్టేషన్‌కు ఈ రైలు ఉదయం 10.37 గంటలకు చేరుకుంది. విజయనగరం ఎంపి బెల్లాన చంద్రశేఖర్‌, ఎమ్మెల్సీలు పి.సురేష్‌బాబు, పి.రఘువర్మ, రైల్వే అధికారులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రైల్వే స్టేషన్‌లో వన్‌ స్టేషన్‌ – వన్‌ ప్రొడక్ట్‌ కార్యక్రమాన్ని కూడా ఎం.పి. ప్రారంభించారు. ఎంపి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ సహకారంతో విజయనగరం జిల్లాలో గత ఐదేళ్ల కాలంలో పెద్ద ఎత్తున రైల్వే వసతులు కల్పించామని చెప్పారు. కేంద్ర రైల్వే మంత్రి, రైల్వే అధికారులను కలసి విన్నవించిన ఫలితంగా చీపురుపల్లిలో రైల్వే పైవంతెన రూ.13 కోట్లతో నిర్మాణం పూర్తికావచ్చిందని, రూ.3 కోట్లతో పాదచారుల వంతెన కూడా మంజూరయ్యిందన్నారు. తన నియోజకవర్గపరిధిలో 9 అండర్‌పాస్‌లు కూడా మంజూరయ్యాయన్నారు. విజయనగరం, చీపురుపల్లి, బొబ్బిలి రైల్వేస్టేషన్ల ఆధునీకరణ పనులు కూడా చేపట్టామన్నారు. విశాఖలో రైల్వేజోన్‌ ఏర్పాటు కోసం కేంద్రం సుముఖంగా వుందని, అనువైన స్థలం కేటాయిస్తే వెంటనే ఏర్పాటు చేస్తామని రైల్వే మంత్రి చెప్పారని పేర్కొన్నారు.

➡️