కొండపోరంబోకు, రైల్వే స్థలాలకు పట్టాలిస్తాం : లోకేష్‌

Mar 19,2024 23:58

ప్రజాశక్తి-తాడేపల్లి : వచ్చే ఎన్నికల్లో టిడిపి నేతృత్వంలోని కూటమి అధికారంలోకి వస్తే తాడేపల్లి, ఉండవల్లి ప్రాంతాల్లోని ఇరిగేషన్‌, కొండ పోరంబోకు, అటవీ, రైల్వే, దేవదాయ భూముల్లో ఉంటున్న ఇళ్లస్థలాలను రెగ్యులరైజ్‌ చేసి ఇళ్ల పట్టాలిస్తామని టిడిపి మంగళగిరి నియోజకవర్గ అభ్యర్థి నారా లోకేష్‌ హామీనిచ్చారు. మంగళవారం తాడేపల్లి పట్టణంలోని ఎఆర్‌కాలనీ, ముగ్గురోడ్డు, కెఎల్‌ రావు కాలనీ ప్రాంతాల్లో జరిగిన రచ్చబండ కార్యక్రమాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. పట్టాలిచ్చే విషయమై హామీ పత్రంపై సంతకం పెట్టి ఇస్తానని చెప్పారు. ప్రస్తుత ఎమ్మెల్యే ఈ విషయంపై కోర్టుకు వెళ్లి అడ్డుకుంటే చీపుర్లతో తిరగబడాలన్నారు. రోడ్లు, అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ, కుళాయిల ద్వారా తాగునీటి సదుపాయం కల్పిస్తామని హామీనిచ్చారు. నియోజకవర్గంలో 20 వేల మంది పేదలకు ఇళ్లు కట్టించి ఇస్తామని చెప్పారు. కేంద్రంలో వచ్చేది ఎన్‌డిఎ ప్రభుత్వమన్నారు. కేంద్ర మంత్రులు అందరూ తమకు అండగా ఉంటారని చెప్పారు. అధికారంలో లేకపోయినా అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యు1 జోన్‌ పేరుతో 175 మంది రైతులను మోసం చేశారన్నారు. కార్యక్రమంలో టిడిపి పట్టణ అధ్యక్షులు వల్లభనేని వెంకట్రావు, ఇతర నాయకులు పాల్గొన్నారు.

➡️