కొటియా సరిహద్దు సమస్యపై చొరవ చూపాలి

Apr 2,2024 21:02

 ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌ : ఒడిశా ప్రభుత్వం గిరిజనులపై దాడిని ఆపాలని, కొటియా సరిహద్దు సమస్యపై రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కారానికి చొరవ చూపాలని సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సాలూరు మండలం గంజాయి భద్ర పంచాయితీ గ్రామాల గిరిజనులతో కలిసి జిల్లా రెవెన్యూ అధికారికి మంగళవారం వినతి అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొంతకాలంగా ఒడిశా ప్రభుత్వం కొఠియా గ్రామాల ప్రజలు సాగు చేస్తున్న భూములను అభివృద్ధి పేరిట బలవంతంగా భూములు లాక్కుంటుందన్నారు. కనీసం సమాచారం గానీ, ఎటువంటి గ్రామసభలు గానీ నిర్వహించకుండానే అనుమతులు అడ్డగోలుగా ఇస్తున్నారని అన్నారు. ఇదేమని అడిగితే తమపై దాడులు, దౌర్జన్యం చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. ఈ ప్రాంతమంతా షెడ్యూల్‌ ఏరియాగా ఉందని, ఈ ప్రాంతంలో ఉన్న అన్ని వనరులపైన సర్వ హక్కులు గిరిజనులనని అన్నారు. ఇవేవీ పట్టించుకోకుండా ఒడిశా ప్రభుత్వం తమపై దౌర్జన్యం చేస్తుందన్నారు. అడ్డుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా గిరిజనులకు అండగా ఉన్న చట్టాలను సక్రమంగా అమలు చేసి, రక్షణ కల్పించాలని కోరారు. వినతిని అందజేసిన వారిలో ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి కోలక అవినాష్‌, నాయకులు వసంతుల సుందరరావు, తాడంగి రాజు, సానం, అజరు, టి.గాసి తదితరులు ఉన్నారు.

➡️