కొత్త భూ హక్కుచట్టంతో నష్టమే ఎక్కువ

Feb 4,2024 20:23

 ప్రజాశక్తి-విజయ నగరం లీగల్‌  : రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అమలులోకి తెచ్చిన భూ హక్కు చట్టం వలన ప్రయోజనం కన్నా నష్టం, ఇబ్బందులే ఎక్కువని ఉత్తరాంధ్ర న్యాయ వాదుల స్టీరింగ్‌ కమిటీ అధ్యక్షులు బెవర సత్య నారాయణ అన్నారు. ఈ చట్టం వల్ల కలిగే ఇబ్బందులపై జిల్లా న్యాయ వాదుల సంఘం అధ్యక్షుడు సి హెచ్‌ దామోదర రామమోహన్‌ రావు అధ్యక్షతన డెంకాడ మండలంలో మోదవలసలో ఆదివారం అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా సత్య నారాయణ మాట్లాడుతూ ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా కొత్త భూ హక్కు చట్టాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం అమల్లో కి తీసుకొచ్చిందన్నారు. ఈ చట్టం వలన వారసత్వం లేదా కొనుగోలు ద్వారా సంక్రమించిన ఆస్తుల వివరాలు ముందుగా టైటలింగ్‌ అధికారి వద్ద నమోదు చేయాలన్నారు. కోర్టులో వున్న కేసులు, కోర్టుకు వెళ్లే ముందు వాటి వివరాలు సంబంధిత అధికారులతో ధ్రువ పత్రాలు సమర్పించాలని తెలిపారు. లేదంటే ఆ ఆస్తులపై హక్కులు కోల్పోయే అవకాశం ఉందన్నారు. హక్కులను భంగం కలగకుండా ప్రజలకు ప్రయోజనకారిగా ఉండేలా చట్టాలు అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై వుందన్నారు. గౌరవ అతిథిగా హాజరైన విశాఖ పట్నం న్యాయ వాదుల సంఘం కార్య దర్శి పైలా శ్రీనివాస రావు మాట్లాడుతూ ఈ చట్టం ఇటు న్యాయ వ్యవస్థల్ని, అటు ప్రజల హక్కులను నిర్వీర్యం చేసేలా ఉందన్నారు. చట్టంపై అవగాహన పెంచుకుని స్థానిక రాజకీయ నాయకులపై వత్తిడి చేసినపుడే మన హక్కులను కాపాడుకోగలమన్నారు. స్థానిక న్యాయ వాదులు ఇనుగంటి సురేష్‌,ధవళ శివరాం,కే రవిబాబు తదితరులు మాట్లాడుతూ ప్రజలంతా ఐక్యంగా పోరాడితే రాజ్యాంగం కల్పించే హక్కులను కాపాడుకోగలమని అన్నారు. కార్యక్రమంలో పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.

➡️