కొర్లవలసకు వైద్యం అందని ద్రాక్ష

ప్రజాశక్తి- రేగిడి : మండలంలోని కొర్లవలస గ్రామానికి వైద్య సేవలు అందని ద్రాక్షగా మిగిలిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ గ్రామం బూరాడ సచివాలయానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ గ్రామంలో సుమారు 700 మంది జనాభా ఉన్నారు. ఈ గ్రామానికి బూరాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి, కనీసం ఏఎన్‌ఎం, ఎంపిహెచ్‌ఒ కేటాయించకపోవడం విడ్డూరంగా ఉందని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. ప్రతి ఇంట్లో ఇద్దరు ముగ్గురు కీళ్ల నొప్పులతో బాధపడుతున్న రోగులున్నారంటే అతిశయోక్తి కాదు. చాలా కాలంగా పొట్నూరు పాపమ్మ, బంకి లక్ష్మి, కొవగాన అన్నపూర్ణ, తులసి, పార్వతి, కొరటాల సరస్వతి మరికొంత మంది కీళ్లు, శరీర అవయవాలు నొప్పులతో బాధపడుతున్నారు. బంకి లక్ష్మి, దుప్పాడ సత్యవతి కీళ్లు నొప్పులతో బెడ్‌ రెడిడ్‌తో మంచాన పడ్డారు. ఇన్ని రోగాలతో గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నా తన పరిధిలో ఉన్న బూరాడ వైద్యాధికారి కన్నెత్తి చూడకపోవడం ఏంటని వారంతా ప్రశ్నిస్తున్నారు. షుగర్‌, బీపీ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న కొంతమంది గ్రామానికి వైద్య సేవలు కరువయ్యాయని ఏ ఒక్క వైద్యం సిబ్బందీ రావడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ డాక్టర్లు రాక చేతి చమురు వదిలించుకుని ప్రయివేటు ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వస్తుందని వాపోతున్నారు. జ్వరాలు, అతిసారా, డెంగీ ఇతరత్రా రోగాలు వస్తే పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వాలు వేలకోట్లు వైద్యం కోసం వెచ్చించినప్పటికీ కొర్లవలస గ్రామానికి వైద్య సేవలు అందక ప్రజలు రోగాల బారిన పడుతున్నారని గ్రామస్తులు వాపోయారు. ఉన్నతాధికారులు దృష్టి సారించి తమ గ్రామానికి వైద్య సేవల కోసం పూర్తిస్థాయిలో వైద్య సిబ్బందిని ఏర్పాటు చేయాలని, వారానికి ఒకసారైనా వైదాధికారి గ్రామాన్ని సందర్శించేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. లేకుంటే సిఎం ఫేసీకి, కలెక్టరేట్‌ స్పందనకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరిస్తున్నారు.

➡️