కోడ్‌ వచ్చేలోపే పనులు పూర్తిచేయాలి : కలెక్టర్‌

Feb 17,2024 20:34

ప్రజాశక్తి-విజయనగరం : ఎన్నికల కమిషన్‌ నోటిఫికేషన్‌ జారీ చేసే లోపు పోలింగ్‌ కేంద్రాల సన్నాహక పనులన్నీ పూర్తి చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ నాగలక్ష్మి అధికారులను ఆదేశించారు. ఎన్నికల కోడ్‌ వచ్చిన తర్వాత ఎన్నికల శిక్షణలు, నిర్వహణకు సంబంధించిన కార్యక్రమాలకే సమయం సరిపోతుందన్నారు. ఎన్నికల సన్నద్ధతపై నియోజకవర్గాల రిటర్నింగ్‌ అధికారులతో కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో శనివారం సమావేశం నిర్వహించారు. పోలింగ్‌ స్టేషన్లు, భవనాల మార్పులు ఏమైనా ఉంటే ఈ నెలాఖరులోగా ప్రతిపాదనలు పంపాలని తెలిపారు. మార్పులు ఉంటే సహేతుకమైన కారణాలను కూడా రాయాలన్నారు. ఈ విషయంలో రాజకీయ పక్షాల ప్రతినిధులతో కూడా చర్చించాలని సూచించారు. పోలింగ్‌ స్టేషన్ల మార్పులనే చేయగలం తప్ప కొత్తగా ఏర్పాటు వీలు కాదని స్పష్టం చేశారు. పోలింగ్‌ స్టేషన్లలో కనీస అవసరాలను తనిఖీ చేయాలని, లేకుంటే వెంటనే ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. ఆర్‌ఒలు చెక్‌ లిస్టు పెట్టుకొని అవసరమగు ఏర్పాట్లన్నిటినీ ముందే చూసుకోవాలన్నారు. సమావేశంలో జెసి కార్తీక్‌, డిఆర్‌ఒ అనిత పాల్గొన్నారు.

➡️