కో ‘ఢి’

Jan 14,2024 20:37 #కో 'ఢి'

జిల్లాలో కోడిపందేలకు తెరలేచింది. సహజంగా సంక్రాంతి పండుగ చివరి రోజైన కనుమ పండుగ రోజున చేపట్టాల్సిన పందేలు తొలిరోజునే నిర్వహించడం గమనార్హం. సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి నియోజకవర్గ పరిధిలోని సింహాద్రిపురం మండలం వేదికగా మారడం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. రాష్ట్ర హైకోర్టు కోడిపందేలను నిర్వహించడం జీవహింస కిందకు వస్తుందని, ఇటువంటి పందేలు ఆడకుండా చూడాలని ఆదేశాలు జారీ చేస్తున్నప్పటికీ అమలుకు ఆమడదూరంలో నిలవడం విస్మయాన్ని కలిగిస్తోంది. ప్రజాశక్తి-కడప ప్రతినిధిజిల్లాలో కోడిపందేలజోరు కొనసాగుతోంది. ముఖ్యమంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గం సింహాద్రిపురం మండలం కోడిపందేలకు వేదికగా మారింది. టిడిపి ప్రభుత్వ హయాం నుంచి కోడిపందేలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. గతేడాది నిర్వహించిన కోడిపందేల్లో కోట్లాది రూపాయలు చేతులు మారినట్లు వార్తలు రావడం తెలిసిందే. తాజాగా సింహాద్రిపురం మండలం బిదినంచర్ల గ్రామ శివారు ప్రాంతంలోని ఎస్సీ కాలనీని వేదికగా చేసుకున్నట్లు సమాచారం. వేదికను ఎంపిక చేసుకోవడమే గాకుండా సంక్రాంతి పండుగ తొలిరోజైన మకర సంక్రాంతి రోజునే పోటీలు నిర్వహించినట్లు విశ్వసనీయంగా తెలి సింది. సహజంగా సక్రాంతి పండుగ చివరి రోజైన మకర సంక్రాంతి రోజున కోడిపందేలు నిర్వహించడం పరిపాటి. ఇందుకు భిన్నంగా ఈయే డాది పండుగ తొలిరోజునే కోడిపందేలను నిర్వహించడం గమనార్హం. పొరుగు రాష్ట్రమైన కర్నాటక, పొరుగు జిల్లాయైన అనంతపురం జిల్లాల నుంచి కోడిపందేలను తిలకించడానికి పెద్దఎత్తున తరలి వస్తున్నట్లు సమాచారం. దీనికితోడు 2024 సార్వత్రిక ఎన్నికల ముంగిట సంక్రాంతి పండుగ తొలిరోజైన మకర సంక్రాంతి రోజు సాయంత్రానికి నాలుగు విభాగాల్లో సుమారు 12 సార్లు కోడిపందేలను పెద్దఎత్తున నిర్వ హించినట్లు తెలుస్తోంది. పందేనికి కనిష్టంగా రూ.10 వేలు పందేలు పెట్టి నట్లు సమాచారం. ఈలెక్కన 15, 16 తేదీల్లో పెద్దఎత్తున కోడిపందేలు నిర్వహించడానికి సమాయత్తం అవుతుండడం గమనార్హం. ఒకవైపు హైకోర్టు సీరియస్‌గా ఆదేశాలు జారీ చేస్తున్నప్పటికీ అమలుకు ఆమడదూరంలో నిలవడం విస్మయాన్ని కలిగిస్తోంది. సంబంధిత మండల పోలీసులు కోడి పందేలను ఆడితే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటన చేయడం వరకు పరిమితం కావడం ఆందోళన కలిగిస్తోంది. దీనిపై జిల్లా ఎస్పీని ఫోన్‌లో మూడు దఫాలు సంప్రదించగా అందుబాటులోకి రాకపో వడం గమనార్హం.

➡️