కౌలు రైతులందరికీ సిసిఆర్‌ కార్డులు ఇవ్వాలి

Mar 9,2024 21:34

ప్రజాశక్తి – సీతానగరం : భూ యజమానుల సంతకంతో సంబంధం లేకుండా వాస్తవ కౌలు రైతులందరికీ సిసిఆర్‌ కార్డులు ఇవ్వాలని, స్కేల్‌ ఫైనాన్స్‌ ప్రకారం రుణాలు మంజూరు చేయాలని ఎపి కౌలురైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.హరిబాబు డిమాండ్‌ చేశారు. శనివారం స్థానిక విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం రాష్ట్రంలో వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో ఉందని, విత్తనం నుండి అన్ని పెట్టుబడులు విపరీతంగా పెరిగాయని, వీటికి తోడు ప్రకృతి వైపరీత్యాలు వల్ల కూడా సాగుదారులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఆటంకాలన్నీ అధిగమించి ఉత్పత్తి చేసిన పంటకు గిట్టుబాటు ధర లేదని, కనీసం ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కూడా దక్కడం లేదన్నారు. ప్రభుత్వ విధానాల వల్ల రైతుల ప్రత్యేకించి కౌలు రైతులు నష్టాల ఊబిలో కూరికిపోయి చివరికి ఆత్మహత్యకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సుమారు 70శాతం కౌలు రైతులు ఉంటారన్నారు. వీరు సాగు మొత్తాన్ని నెత్తికెత్తుకుని మోస్తున్న ప్రభుత్వం నుంచి ఏ విధమైన సహాయం కానీ భరోసా కాని అందడం లేదన్నారు. 2011లో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం రుణ అర్హత కార్డులు (ఎల్‌ఇసి) చట్టం తెచ్చిందని, భూ యజమాని అనుమతి లేకపోయినా, కౌలు రైతులకు గ్రామ సభల ద్వారా కార్డు ఇచ్చేవారని అన్నారు. అలా ఇచ్చేదానికి ప్రత్యేక యంత్రాంగం చిత్తశుద్ధి కొరవడడం వల్ల కేవలం 17.7శాతం కౌలు రైతులకు కార్డు వచ్చాయన్నారు. దీంతో కౌలు రైతుల ఒత్తిడి, ఉద్యమాల వల్ల వ్యవసాయ శాఖ సాగు ధ్రువీకరణ పత్రాలు ( సిఒసి )ఇచ్చారన్నారు. అయినా ఎక్కువ శాతం మంది కౌలు రైతులకు కార్డులు రుణాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కౌలు రైతులందరికీ స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ప్రకారం బ్యాంకులో రుణాలు ఇవ్వడం లేదని, ముందస్తు క్యాష్‌ కౌలు విధానం చాలా దారుణమైన దోపిడీ కాబట్టి ప్రభుత్వం ఈ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. దేవాలయ భూములు సాగు చేస్తున్న వారందరికీ సిసిఆర్‌ కార్డులు, బ్యాంకు రుణాలు, రైతు భరోసా పంట నష్టపరిహారం బీమా ఇవ్వాలని, సిసిఆర్‌ కార్డుతో సంబంధం లేకుండా సాగు చేస్తున్న వారందరికీ ఈ క్రాఫింగ్‌ చేయాలని కోరారు. ప్రతి మూడు నెలలకు వ్యవసాయ, రెవెన్యూ, బ్యాంకర్లు రైతు సంఘాలతో ఉమ్మడి సమావేశాలు ఏర్పాటు చేయాలని, ప్రభుత్వం ఇస్తున్న పెట్టుబడి సాయం 10 ఎకరాల వరకు ఎకరాకు రూ.పదివేలు ఇవ్వాలని, సర్టిఫికెట్లతో సంబంధం లేకుండా గ్రామసభల ద్వారా ఆత్మహత్య చేసుకున్న రైతు, కౌలు రైతులను గుర్తించి రూ.25 లక్షలు ఎక్స్‌గ్రేషియో చెల్లించాలని, పంటల బీమా రాష్ట్ర ప్రభుత్వమేని నిర్వహించాలని, సన్న, చిన్న కారు రైతులు, కౌలు రైతుల ఇన్సూరెన్స్‌ బీమా ప్రభుత్వమే కట్టాలని, కౌలు రైతులందరికీ రుణమాఫీ చేయాలని, ప్రతి పేద కౌలు రైతుకు నెలకు రూ.5వేలు పెన్షన్‌ ఇవ్వాలని, ముందస్తు క్యాష్‌ విధానం రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. విలేకరుల సమావేశంలో కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి రెడ్డి రమణమూర్తి, రైతు సంఘం జిల్లా కార్యదర్శి రెడ్డి లక్ష్ము నాయుడు, కౌలు రైతు సంఘం కమిటీ సభ్యులు బి.సావిత్రమ్మ పాల్గొన్నారు.

➡️