క్రీడా పోటీల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు

Dec 20,2023 20:17

  ప్రజాశక్తి-విజయనగరం :  జిల్లాలో ఆడుదాం ఆంధ్ర క్రీడల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్‌ ఎస్‌.నాగలక్ష్మి ముఖ్యమంత్రికి వివరించారు. జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన ఇంటింటి సర్వే ద్వారా 1.10 లక్షల మంది క్రీడాకారులు యీ పోటీల్లో పాల్గొనేందుకు తమ పేర్లు నమోదు చేసుకున్నట్టు తెలిపారు. ఈ పోటీలను తిలకించేందుకు 9 లక్షల మంది ఆసక్తి వ్యక్తంచేస్తూ పేర్లు నమోదు చేసుకున్నారని పేర్కొన్నారు. ఐదు క్రీడాంశాల్లో పోటీ పడేందుకు 14 వేల మంది ఆసక్తి చూపారని చెప్పారు. జిల్లాలో పురుషుల కంటే మహిళలే అధికంగా క్రీడల్లో పాల్గొనేందుకు తమ పేర్లు నమోదు చేసుకున్నట్టు చెప్పారు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం నిర్వహణపై ముఖ్యమంత్రి బుధవారం జిల్లా కలెక్టర్‌లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శారీరక వ్యాయామానికి ఉపయోగపడే క్రీడలనే ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. జిల్లాకు సంబంధించిన వివరాలను కలెక్టర్‌ వెల్లడించారు. పోటీల నిర్వహణ కోసం 321 క్రీడామైదానాలు సిద్ధం చేశామన్నారు. జిల్లాకు చెందిన అంతర్జాతయ క్రీడాకారిణులు మత్ససంతోషి, ఎస్‌.పల్లవి, శ్రీలక్ష్మిలను పోటీలకు బ్రాండ్‌ అంబాసిడర్లుగా నియమిస్తున్నామని పేర్కొన్నారు. గ్రామ స్థాయిలో క్రీడా పోటీల నిర్వహణపై వలంటీర్లు, సచివాలయ సిబ్బందికి శిక్షణ ఇచ్చామన్నారు. ప్రతి మండలంలో పోటీల నిర్వహణకు మండల ప్రత్యేకాధికారులను నియమించామని, డివిజన్‌ స్థాయిలో ఆర్‌.డి.ఓలు పర్యవేక్షణ చేస్తున్నారని పేర్కొన్నారు. సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ మయూర్‌ అశోక్‌, డిఆర్‌ఒ ఎస్‌.డి.అనిత, డిఇఒ లింగేశ్వరరెడ్డి, జిల్లా పరిషత్‌ సిఇఒ రాజ్‌కుమార్‌, డిఎంహెచ్‌ఒ భాస్కరరావు, గ్రామవార్డు సచివాలయాల సమన్వయ అధికారి నిర్మలాదేవి, డిఎస్‌డిఒ తదితరులు పాల్గొన్నారు.

➡️