క్రీడా సామగ్రి పంపిణీ 

Dec 8,2023 21:59

ప్రజాశక్తి-గజపతినగరం  :  ఆడుదాం ఆంధ్రా క్రీడా సామగ్రిని శుక్రవారం స్థానిక ఎంపిడిఒ కార్యాలయంలో ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య సచివాలయ సిబ్బందికి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామస్థాయిలో ఉన్న యువతీ, యువకుల సామర్థ్యాన్ని గుర్తించాలని, వారిలో ఉత్సాహం నింపాలని, ఆత్మవిశ్వాసం పెంపొందాలనే మంచి ఉద్దేశంతో సిఎం జగన్మోహన్‌ రెడ్డి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. 15 ఏళ్ల నుండి 60 ఏళ్లలోపు వయసు గలవారు ఎవరైనా ఆడుదాం ఆంధ్రా వెబ్‌సైట్‌లో, క్యూఆర్‌ కోడ్‌ ద్వారా, టోల్‌ ఫ్రీ నెంబర్‌ 1902కి కాల్‌ చేయడం, వాలంటీర్‌ సర్వే ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చని తెలిపారు. ప్రతిభ కనబరిచిన వారిని నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయికి ఎంపిక చేయనున్నట్లు చెప్పారు. ఈ నెల 15 నుండి జనవరి 31 వరకు వివిధ స్థాయిల్లో క్రీడా సంబరాలు జరుగుతాయని తెలిపారు. పోటీలకు క్రీడా సామగ్రిని ప్రభుత్వం సచివాలయాలకు అందిస్తుం దన్నారు. ఎంపిపి, జెడ్‌పిటిసి, సర్పంచులు ఈ కార్యక్రమంలో భాగస్వాములై ఉంటారని తెలిపారు. కార్యక్రమంలో ఎంపిపి బెల్లాన జ్ఞాన దీపిక, పిఎసిఎస్‌ అధ్యక్షులు కరణం ఆదినారాయణ, వైసిపి నాయకులు లెంక గణేష్‌, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.విజయనగరం టౌన్‌ : డిసెంబర్‌ 15నుంచి జరగనున్న ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీల కు క్రీడా కిట్లును డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి శుక్రవారం పంపిణీ చేశారు. శుక్రవారం జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో రాజీవ్‌ క్రీడా ప్రాంగణంలో ఉన్న ఇండోర్‌ స్టేడియంలో క్రీడా సామాగ్రిని సచివాలయాల వారీగా అయా సచివాలయ కార్యదర్శులకు అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో పండగ వాతావరణంలో గ్రామ స్థాయి, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిలో పోటీలు ఐదు క్రీడా అంశాల్లో నిర్వహిస్తోందన్నారు. సుమారుగా రూ.50 కోట్లతో ఖర్చుతో పోటీలను నిర్వహించి ప్రతిభ కలిగిన క్రీడా కారులను గుర్తించేందుకు ఈ క్రీడలు ఎంతో దోహద పడతాయని అన్నారు. కార్యక్రమంలో మేయర్‌ వెంపడాపు విజయలక్ష్మి, డిఎస్‌డిఒ అచ్యుతరావు తదితరులు పాల్గొన్నారు.

➡️