క్వారీ తిరునాళ్లకు భారీబందోబస్తు

Mar 5,2024 23:16

ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధి : మహాశివరాత్రి సందర్భంగా చేబ్రోలు మండలం వడ్లమూడి క్యారీ వద్ద జరిగే తిరునాళ్లకు తగిన బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులను జిల్లా ఎస్‌పి తుషార్‌ దూడి ఆదేశించారు. క్వారీ తిరునాళ్లు జరిగే ప్రదేశాలను ఎస్పీ మంగళవారం పరిశీలించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యమూ కలగకుండా పోలీస్‌ అధికారులు భద్రత ఏర్పాట్లు చేయాలన్నారు. క్యూ లైనులను, బారీకేడ్లను పరిశీలించారు. విద్యుత్‌ ప్రభలు విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, గుంటూరు-తెనాలి మార్గంలో ట్రాఫిక్‌ సమస్య రాకుండా చూడాలని చెప్పారు. ప్రత్యేక ట్రాఫిక్‌ పోలీస్‌ బృందాన్ని నియమించాలన్నారు. తిరునాళ్లకు ఆయా గ్రామాల నుండి వచ్చే ప్రభలు నిలుపు కోవడానికి, సందర్శకుల వాహనాలను నిలుపుకోవడానికి పార్కింగ్‌ ప్రాంతాలను సూచించారు. శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా చూడటానికి పోలీస్‌ కంట్రోల్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ప్రత్యేక నిఘా బృందాన్నీ నియమిస్తున్నట్టు తెలిపారు. ఎస్పీవెంట తెనాలి డీఎస్పీ రమేష్‌బాబు, పొన్నూరు సిఐ కోటేశ్వరరావు, స్పెషల్‌ బ్రాంచ్‌ సిఐ వెంకటరావు, ఆలయ కమిటీ సభ్యులు ఉన్నారు.

➡️