గట..గట..గట..

Jan 17,2024 21:37

ప్రజాశక్తి – విజయనగరంటౌన్‌ :   పండగల్లో పెద్ద పండగ సంక్రాంతి. సంప్రదాయబద్ధ పండగగా దీనికి పేరున్నా క్రమేపీ దీని తీరు మారుతోంది. భోగి, సంక్రాంతి, కనుమ రోజుల్లో మద్యం ఏరులై పారడం పరిపాటిగా మారింది. ఈ సంక్రాంతికీ జిల్లాలో మాంసం, చేపల విక్రయాలు భారీగా జరిగాయి. మాంసాహారులకు ప్రీతిపాత్రమైన మంగళవారం కనుమ రావడంతో వారి ఎంజారుమెంట్‌కు అవధుల్లేకుండా పోయింది. జిల్లా మొత్తంగా పండగ మూడు రోజులతో పాటు ముక్కనుమ సందర్భంగా సుమారు రూ.5 కోట్లు విలువజేసే మద్యాన్ని జనం తాగేశారు. ఒక్క విజయనగరం పరిధిలోనే కోటి రూపాయలు మద్యం అమ్మకాలు జరిగాయి. వైన్‌షాపులు, బార్లు ముందు మందుబాబులు బారులు తీరారు. జిల్లాలో 144 ప్రభుత్వ మద్యం షాపులు, 27 బార్లు ఉన్నాయి. ఇవన్నీ పండగ మూడురోజులూ రద్దీగా కనిపించాయి. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో కొనుక్కొని తాగేవారే ఎక్కువగా ఉన్నారు. మందుబాబులు మద్యాన్ని బహిరంగంగా రోడ్లపై సేవిస్తున్నా పోలీసులు పట్టించుకున్న దాఖలాలు లేవు. మద్యం పూటుగా తాగి అనేకమంది మద్యం షాపులున్న ప్రాంతాల్లోనే రోడ్లపై నిషాలో పడి కనిపించారు. కొంతమంది మద్యం బాబులు తాగిన మత్తులో ఊగుతూ, జోగుతూ పాదచారులను ఇబ్బందులకు గురిచేశారు. మద్యం దుకాణాల నిర్వాహకులు మూడు రోజులు ముందుగానే భారీ స్టాక్‌ తెచ్చుకొని సిద్ధంగా ఉంచారు. మందుబాబుల వ్యసనాన్ని, అవసరాలను మద్యం షాపుల ద్వారా ప్రభుత్వం భారీగానే సొమ్ము చేసుకుంది. బార్లు, ఎసి రెస్టారెంట్లలో అయితే ఎసి ఛార్జీలు కలుపుకొని ఒక ఫుల్‌ బాటిల్‌పై ఏకంగా రూ.120 పెంచేశారు. ఇక బీర్‌ విషయానికొస్తే ఒక్కో బాటిల్‌పై రూ.10 నుంచి రూ.15 వరకూ పెంచి విక్రయించారు. పండగ నెపంతో బార్ల నిర్వాహకులు ఇష్టానుసారంగా ధరలను పెంచినా పోలీసులుగానీ, ఎక్సైజ్‌ అధికారులుగానీ కన్నెత్తి కూడా చూడలేదు. పోటాపోటీగా మాంసం విక్రయాలుపండగ నేపథ్యంలో జిల్లాలో 8 లక్షల కోళ్లు, 5వేల మేకలు, గొర్రెలు జీర్ణమైయినట్లు అంచనా. జిల్లాలో ఏ చికెన్‌, మటన్‌ సెంటర్‌ చూసినా కిక్కిరిసి కనిపించాయి. క్యూలైన్లలో ఉండి మరీ కొనడం కనిపించింది. సోమవారం వరకూ కిలో స్కిన్‌ కోడి మాంసం రూ.180, స్కిన్‌ లెస్‌ రూ.200కు అమ్మగా మంగళవారం వాటి రేటును వరుసగా రూ.210, రూ.220కి పెంచేశారు. మటన్‌ కిలో రూ.800 ఉండగా రూ.900కి విక్రయించారు. చేపల అమ్మకాలు కూడా జోరుగానే సాగాయి. కొన్ని చికెన్‌ దుకాణాల వద్ద పెద్దపెద్ద క్యూలైన్లు కనిపించాయి.

➡️