‘గడప గడపకు’ నిధులు నాలుగో వంతే

Feb 27,2024 20:55

ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి  : పంచ పాండవులు ఎంత మందంటే ‘మంచం కోళ్ల మాదిరిగా ముగ్గురేనంటూ రెండు వేళ్లు చూపిస్తూ ఒక్కటే’ అని అన్నట్టుగా ఉంది ప్రభుత్వం నిర్వహించిన గడప గడపకు వైసిపి ప్రభుత్వం పథకం అమలు తీరు. సిఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఒత్తిడితో ఎమ్మెల్యేలు గడప గడపకు నెలరోజులు పాటు వెళ్లి ప్రభుత్వాన్ని బలపర్చాలంటూ విన్నవించినప్పటికీ ఆ పథకం ద్వారా గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన పేరిట ప్రతి సచివాలయానికి రూ.20లక్షల వరకు ఖర్చుచేస్తామని చెప్పిన సంగతి తెలిసిందే. ఈలెక్కన జిల్లాలోగల 626 సచివాలయాలకు రూ.1252 కోట్ల మేర మంజూరు చేయాల్సి ఉంది. వీటిని గ్రామాల్లోని తాగునీరు, కాలువలు, సిసి రోడ్లు తదితర మౌలిక సదుపాయాలకు ఖర్చు చేయాలని ప్రభుత్వం విధివిధానాలు రూపొందించింది. కానీ, మన జిల్లాలో ప్రజాప్రతినిధుల సిఫార్సులతో రూ.107.3 కోట్లతో 3,357 పనులకు మాత్రమే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఇందులో 3,150 పనులకుగాను రూ.97కోట్లు మంజూరు చేసింది. ఇందులోనూ రూ.72.75కోట్ల విలువలగల 2,448 పనులు ప్రారంభించారు. రూ.24.35కోట్ల వ్యయంతో 802 పనులు మాత్రమే పూర్తయ్యాయి. చాలా వరకు బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్టు పలువురు సర్పంచులు, కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీన్నిబట్టి జిల్లాలో తలపెట్టిన పనులుగానీ, నిధుల వినియోగం విషయంలో గానీ నాలుగో వంతు మాత్రమే జరిగాయని అర్థమౌతోంది. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కేటాయిస్తామన్న నిధుల్లో అరకొరగానే విడుదల చేయడం, ఇంకా చాలా గ్రామాలు సమస్యలతో కొట్టిమిట్టాడుతున్నాయి. ఈ నేపథ్యంలో గడప గడపకు వైసిపి ప్రభుత్వం పేరిట ఎమ్మెల్యేలు, నాయకులు ఎన్నికల ముందు ఇంటింటికీ వెళ్లడానికి మాత్రమే ఉపయోగ పడిందని, ఆ సందర్భంగా ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పనపై ఇచ్చిన హామీలు నెరవేరలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

➡️