గణతంత్ర వేడుకల ఏర్పాట్లు త్వరగా పూర్తి చేయాలి

ప్రజాశక్తి రాయిచోటి భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు స్థానిక పోలీస్‌ పెరేడ్‌ గ్రౌండ్‌ లో అన్ని ఏర్పాట్లు పక్కాగా త్వరగా పూర్తి చేయాలని జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌ వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. బుధవారం రాయచోటిలోని పోలీస్‌ పరేడ్‌ మైదానంలో భారత గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లను జిల్లా అడిషనల్‌ ఎస్‌పి రాజ్‌ కమల్‌తో కలిసి పరిశీలించారు.భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను పెరేడ్‌ గ్రౌండ్‌లో ఘనంగా నిర్వహించుటకు, మైదానాన్ని, డయాస్‌ను పోలీస్‌, రెవెన్యూ అధికారులు చక్కని అలంకరణతో సిద్దం చేయాలన్నారు. వేడుకల సందర్బంగా ప్రజా ప్రతినిధులకు, జిల్లా అధికారులకు, స్వాతంత్య్ర సమరయోధులకు, ప్రజలకు సీటింగ్‌ అరెంజ్‌ మెంట్లు ప్రోటోకాల్‌ ప్రకారం చేయాలని రెవెన్యూ డివిజనల్‌ అధికారిని ఆదేశించారు. మేరకు మైదానంలో ఏర్పాట్లను ఆయన పరిశీలించి తగిన ఆదేశాలు జారీ చేశారు. శాఖల ప్రగతిని చూపే శకటాల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. గ్రౌండ్‌ అంతా పరిశుభ్రంగా సిద్ధం చేయాలన్నారు. ప్రజలందరూ వేడుకలను వీక్షించే విధంగా అవసరమైన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయించాలన్నారు. కార్యక్రమంలో రాయచోటి ఆర్‌డిఒ రంగస్వామి, మున్సిపల్‌ కమిషనర్‌ గంగా ప్రసాద్‌, వివిధ శాఖల జిల్లా అధికారులు, పోలీస్‌ అధికారులు పాల్గొన్నారు.

➡️