గిడ్డంగుల నిర్వహణకు కమిటీ ఏర్పాటు

Jan 30,2024 21:09

 ప్రజాశక్తి-విజయనగరం  : జిల్లాలో అన్ని విభాగాల వద్ద ఉన్న గిడ్డంగుల నిర్వహణకు, వినియోగానికి సంబంధించి పర్యవేక్షణ చేయడానికి జిల్లా స్థాయి కమిటీ ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి తెలిపారు. అందుకోసం వెంటనే ప్రతిపాదనలను పంపాలని వ్యవసాయ శాఖ జెడి తారక రామారావుకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లో జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ చిరు ధాన్యాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని , రైతులకు అవగాహన కలిగించి జిల్లాలో చిరుధాన్యాల సాగును పెంచేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ ఏడాది 4 వేల ఎకరాల్లో లక్ష్యంగా చేసుకోగా 2 వేల ఎకరాల్లో రాగి పంట వేయడం జరిగిందని, వర్షాబావ పరిస్థితుల దృష్ట్యా పంట సాగు తగ్గిందని జెడి తెలిపారు. ఎఎబి చైర్మన్‌ వెంకటేశ్వర రావు మాట్లాడుతూ మొక్క జొన్నతో రైతులకు అధిక లాభాలు వస్తున్నాయని, రాగిలో హై ఈల్డ్‌ వెరైటీ ఇచ్చి ప్రోత్సహిస్తే గాని అంత లాభదాయకం కాదని అన్నారు. ఈ ఏడాది వరి దిగుబడులు గత ఏడాది కన్నా అధికంగా వచ్చాయని జెడి తెలుపగా ధాన్యం సేకరణ, బిల్లుల చెల్లింపుల్లో కృషిని ఎఎబి చైర్మన్‌ అభినందించారు. సమావేశంలో డిసిఎంఎస్‌ చైర్మన్‌ డాక్టర్‌ భావన, డిసిసిబి చైర్మన్‌ చిన్న రామునాయుడు, సహాయ కలెక్టర్‌ వెంకట త్రివినాగ్‌, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు పాల్గొన్నారు

➡️