గిరిజనులకు చింతేనా?

Feb 27,2024 21:03

 ప్రజాశక్తి – గుమ్మలక్ష్మీపురం : ఏజెన్సీ ప్రాంతంలో గిరిపుత్రులు తరతరాల నుంచి అడవినే నమ్ముకొని పోడు వ్యవసాయంపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ప్రతి ఏటా పండే ప్రధాన పంటలైన చింతపండు, జీడిపై ఎక్కువ శాతం ఆధారపడుతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి వచ్చినా చింత పంట దిగుబడి ఆశాజనకంగా లేకపోవడంతో గిరిజనులు తీవ్ర నిరాశతో ఉన్నారు. ఖరీఫ్‌లో ఎక్కువ వర్షాలు, చలి తీవ్రత కారణంగా ఫిబ్రవరి వచ్చినా చింతపండు దిగుబడి అంతంత మాత్రంగానే ఉంది. చింతపండు సేకరణ కోసం పిల్లాపాపలతో కొండలు, గుట్టలపై ఉన్న చింత చెట్ల వద్దకు వెళ్లి ఎంతో కష్టపడి చింత బొట్టలను సేకరించి, తొక్కలు తీసి అమ్మకాల కోసం కిలోమీటర్లు కాలినడకన మండల కేంద్రానికి, వారపు సంతలకు, జిసిసి ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తుంటారు. ప్రతి ఏటా చింతపండు సేకరణలో వ్యయ ప్రయాసలు పడుతున్న గిరిజనులకు గిట్టుబాటు ధర లేక.. చివరకు చేసేది లేక తక్కువ ధరకే అమ్ముకోవాల్సి వస్తుంది. మరోవైపు జిసిసి నిబంధనలు గిరి పుత్రులకు ఆందోళన కలిగిస్తున్నాయి. జిసిసి కొనుగోలు కేంద్రాలకు చింతపండు అమ్మకానికి తీసుకొస్తే నాణ్యత, పొడిగా లేదని, తడిచిన చింతపండు తీసుకొచ్చారని సిబ్బంది నిబంధనలతో ఇబ్బంది పెడుతున్నారు. దీంతో గత్యంతరం లేక చివరి నిమిషంలో వ్యాపారులకు తక్కువ ధరకే అమ్ముకోవాల్సి వస్తోంది. జిసిసి కిలో చింతపండు రూ.32.40 పైసలు ధర నిర్ణయించి కొనుగోలు చేయడంతో గిరిజనుల్లో నిరాశ నెలకొంది.పదివేల క్వింటాళ్ల దిగుబడి జిల్లాలోని గుమ్మలక్ష్మీపురం, కురుపాం, జియమ్మవలస, కొమరాడ, పాచిపెంట, మక్కువ, సీతంపేట, భామిని మండలాల్లో 70వేలకు పైగా చింత చెట్లు విస్తారంగా ఉన్నాయి. ప్రతి ఏటా పదివేల క్వింటాళ్ల వరకు చింతపండు దిగుబడి వస్తోందని అంచనా. గిరిజనులు సేకరించిన చింతపండును గిరిజన సహకార సంస్థ కొనుగోలు చేస్తుంది. అనంతరం టెండర్లు పిలిచి వర్తకుల ద్వారా మైదాన ప్రాంతాలకు తరలిస్తుంటారు. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. జిసిసికి జిల్లాలో కోల్డ్‌ స్టోరేజ్‌ లేకపోవడంతో పంట నిల్వలను ఇతర ప్రాంతాల్లో భద్రపరచాల్సిన పరిస్థితి నెలకొంది. జిసిసి నెల నెలా టన్నులు లెక్కన అద్దె చెల్లించాల్సి వస్తోంది. ఏటా గిరిజనులు సేకరిస్తున్న చింతపండుకు టెండర్లు పిలుస్తున్నప్పటికీ జిసిసి కొనుగోలు చేస్తున్న ధర రావడం లేదు. గత ఐదేళ్లలో 18,590 కింటాళ్ల చింతపండు కొనుగోలు చేస్తే, ఇప్పటి వరకు 11,357 క్వింటాళ్లు మాత్రమే అమ్మకాలు జరిగాయి. 7,233 క్వింటాళ్లు చీపురుపల్లి కోల్డ్‌ స్టోరేజ్‌లో చింతపండు నిల్వచేసి ప్రతి ఏటా రూ.7 లక్షలు అద్దె చెల్లిస్తుంది. దీంతో ఆ సంస్థ పూర్తిస్థాయిలో కొనుగోలుకు ఆసక్తి చూపడం లేదు. నాణ్యత లేదని, తడిపిన చింతపండు తీసుకొస్తున్నారని రకరకాల కారణాలు చూపుతూ అంతంతమాత్రంగానే అధికారులు కొనుగోలు చేస్తున్నారని గిరిజన సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. తప్పని దళారుల బెడదగిరిజనులు సేకరిస్తున్న చింతపండు నాణ్యత లేదని జిసిసి అధికారులు కొనుగోలు చేయకపోవడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో దళారులను ఆశ్రయించి తక్కువ ధరకే పంట మొత్తాన్ని అమ్ముకోవాల్సి వస్తోంది. గిరిజనుల నుంచి చింతపండు కొనుగోలు చేసిన వర్తకులు కోల్డ్‌ స్టోరేజీల్లో నిల్వ ఉంచి మంచి ధర పలికినప్పుడు విక్రయిస్తున్నారు. ఎంతో కష్టపడి గిరిజనులు చింతపండు సేకరిస్తున్నా గిట్టుబాటు ధర లేకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నారు.

నిబంధనలు సరికావు

గిరిజనుల నుంచి చింతపండు కొనుగోలు చేస్తున్న గిరిజన సహకార సంస్థ పలు నిబంధనలు పెట్టడంతో తీవ్రంగా నష్టపోతున్నారు. పండు సేకరణలో నాణ్యత లేదని, తడిపి తీసుకు వస్తున్నారని అధికారులు చెప్పడంతో తక్కువ ధరకే వ్యాపారులకు అమ్ముకోవాల్సి వస్తుంది. గిరిజన సంక్షేమం, అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన జిసిసి ద్వారా గిరిజనులు సేకరించిన అన్ని రకాల అటవీ ఉత్పత్తులను కొనుగోలు చేయాలి.

మండంగి రమణ, ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు.

కిలో రూ. 80కు కొనుగోలు చేయాలి

ఈ ఏడాది గిరిజన సహకార సంస్థ కిలో చింతపండు ధర రూ.80కు నిర్ణయించి గిరిజనుల వద్ద నుంచి కొనుగోలు చేయాలి. ప్రతి వారపు సంతలోనూ, గ్రామంలోనూ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి గిరిజనుల వద్ద నుంచి నేరుగా చింతపండు కొనుగోలు చేయాలి.

కోలక అవినాష్‌,ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి

చింతపండు కొనుగోలు ప్రారంభిస్తాం..

గుమ్మలక్ష్మీపురం గిరిజన సహకార సంస్థ ద్వారా తాడికొండ, గుమ్మ లక్ష్మీపురం, దేరువాడ, దుడ్డు ఖల్లు, నీలకంఠాపురం, వంగర, వలస బల్లేరు, గొరడ, మొండెంఖల్‌ గ్రామాల్లో చింతపండు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశాం. గిరిజనుల నుంచి చింతపండు కొనుగోలు ప్రారంభిస్తాం. తడి చింత పండు కొనుగోలు చేసే ప్రసక్తే లేదు. జిసిసి నిర్ణయించిన ధర రూ.32.40పైసలు. ఈ ఏడాది 100 టన్నులు కొనుగోలు లక్ష్యంగా పెట్టుకున్నాం.

వి.కష్ణ ప్రసాద్‌ జిసిసి మేనేజర్‌, గుమ్మలక్ష్మీపురం.

➡️