గిరిజన సంక్షేమ ఉపాధ్యాయుల సమస్యలపై నిరసన

Dec 16,2023 21:35

 ప్రజాశక్తి- కలెక్టరేట్‌    :  ఐటిడిఎ అధికారుల వైఖరి, గిరిజన సంక్షేమ ఉపాధ్యాయుల సమస్యలపై యుటిఎఫ్‌ జిల్లా శాఖ పక్షాన శనివారం స్థానిక ఐటిడిఎ వద్ద ఉపాధ్యాయులు మోకాళ్లపై నిరసనను తెలిపారు. ఏడాదిగా యుటిఎఫ్‌ డిమాండ్‌ మేరకు ప్రధానోపాధ్యాయుల ఉద్యోగోన్నతిపై స్పందించిన పిఒకు యుటిఎఫ్‌ ధన్యవాదాలు తెలిపింది. అదే సందర్భంలో ప్రమోషన్ల అర్హతపై పారదర్శకత లేకుండా చేశారని, కింద స్థాయి అధికారులు పిఒను తప్పు దోవ పట్టిస్తున్నారని, అర్హతలు లేకుండా అర్హతలు ఉన్నట్లుగా క్లారిఫికేషన్‌ ఇచ్చారని దీనిపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని జిల్లా అద్యక్ష ప్రధాన కార్యదర్శులు టి. రమేష్‌, ఎస్‌.మురళీమోహనరావు డిమాండ్‌ చేశారు. అలాగే పని సర్దుబాటు అనే పేరుతో తమకు నచ్చిన వారిని డెప్యుటేషన్లు వేశారని, సబ్జెక్టు టీచర్ల కొరత పేరుతో బాలికల పాఠశాలలకు రెగ్యులర్‌ వారిని కాకుండా కాంట్రాక్ట్‌ వారిని వేశారని ఈ విషయంలో ముడుపులు ముట్టినట్లు భావిస్తున్నామని అన్నారు. అలాగే సవర భాషావాలంటీర్ల జీతాలు చెల్లించకుండా జాప్యం జరుగుతుందని, జాతపు వాలంటీర్లను నియమించేందుకు ఇప్పటి నుంచే చర్యలు ప్రారంభించాలని డిమాండ్‌ చేశారు. హెచ్‌ఎంలకు ప్రమోషన్లు ఇచ్చినప్పటికీ స్కూల్‌ అసిస్టెంట్‌ కేడర్‌ ప్రమోషన్లు వెంటనే ఇవ్వాలని, లేనిచో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో యుటిఎఫ్‌ జిల్లా కార్యదర్శులు కె.భాస్కరరావు, కె.మురళి, ఎన్‌.శ్రీనివాసరావు, పి.వెంకట నాయుడు, మండల నాయకులు పాల్గొన్నారు.

➡️