గుండ్లకమ్మ నుంచి నీటి విడుదలకు అంగీకారం

ప్రజాశక్తి-నాగులుప్పలపాడు : గుండ్లకమ్మ ప్రాజెక్టు పరిధిలో సాగు చేసిన పంటలకు సాగునీరు విడుదల చేసేందుకు అంగీకారం కుదిరింది మంగళవారం నుంచి సాగునీరు విడుదల చేసేందుకు రంగం సిద్ధమైంది. జిల్లా కలెక్టరు క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర మంత్రి మేరుగ నాగార్జున, జిల్లాకలెక్టరు దినేష్‌ కుమార్‌, ప్రాజెక్టు అధికారులు రైతు, కౌలు రైతు సంఘాల నాయకులు, రాజకీయ నాయకులు, రైతులతో గుండ్లకమ్మ ప్రాజెక్టు నుంచి సాగునీరు విడుదలపై సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతుసంఘం జిల్లా అధ్యక్షుడు జె. జయంతిబాబు మాట్లాడుతూ గుండ్లకమ్మ ప్రాజెక్టు పరిధిలో 10వేల ఎకరాల్లో మిర్చి, మరో 10వేల ఎకరాల్లో పొగాకు తదితర పంటలను రైతులు సాగు చేసినట్లు తెలిపారు. ఈపాటికే ఎకరానికి లక్షలాది రూపాయల మేర పెట్టుబడి పెట్టినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆ పంటలకు నీటితడులు అవసరం ప్రాధాన్యత సంతరించుకుందన్నారు ఈ నేపథ్యంలో పంటలకు కనీసం ఓక్కతడైన నీరు అందిస్తేనే పెట్టిన పెట్టుబడులు రైతులు చేతికి వస్తాయని తెలిపారు. లేకుంటే ఒక్కరూపాయి కూడా తిరిగి రాక రైతులు తీవ్రంగా నష్టపోతారని మంత్రి, కలెక్టరు దష్టికి తీసుకెళ్లారు. దీంతో స్పందించిన కలెక్టర్‌ దినేష్‌ కుమార్‌ అందరి సమక్షంలో ప్రాజెక్టు అధికారులతో చర్చించారు. వెంటనే గుండ్లకమ్మ ప్రాజెక్టులో ఉన్న నీటిని వ్యవసాయ అవసరాలకు విడుదల చేయాలని సూచించారు.తదుపరి అవసరాలకు సాగర్‌ నుంచి గుండ్లకమ్మకు నీటిని విడుదలచేయాలని ప్రభుత్వానికి నివేదిక పంపుతామని తెలిపారు. దీంతో గుండ్లకమ్మ నుంచి సాగునీరు విడుదలకు అంగీకారం కుదిరింది. ఈకార్యక్రమంలో రైతుసంఘం జిల్లా కార్యదర్శి పమిడి వెంకట్రావు, కౌలురైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ఎస్‌కె.బాబు, నాగులుప్పలపాడు మండల రైతుసంఘం కార్యదర్శి మారెళ్ళ వెంకట్రావు, కౌలురైతు సంఘం జిల్లా సహj ుకార్యదర్శి టి.శ్రీకాంత్‌, వైసిపి వాణిజ్య విభాగం రాష్ట్ర కార్యదర్శి నలమలపు కష్ణారెడ్డి, ఓబుల్‌ రెడ్డి ,రైతులు మారెళ్ళ అనిల్‌ , పాలపర్తి యోనా తదితరులు పాల్గొన్నారు.

➡️