గుంతల్ని చూశారు…కప్పేశారు..

Feb 4,2024 20:47

ప్రజాశక్తి- బొబ్బిలి: ఎవరో వస్తారని ఏదో చేస్తారని.. అనుకోకుండా..వారు నిత్యం ప్రమాదకరమైన గోతులను పూడ్చే సేవా కార్యక్రమం మొదలు పెట్టారు. పాత బొబ్బిలి నుండి బొబ్బిలి జ్యూట్‌ మిల్‌ రోడ్డు వరకు రోడ్లపై వున్న పెద్ద గుంతల్ని ఆదివారం ఉదయం గాంధీ స్మారక నిధి సభ్యులు పూడ్చారు. బొబ్బిలి – పార్వతీ పురం హైవే మీద నిరంతర రద్దీ వల్ల రోడ్డుపై పలు చోట్ల పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. వీటి వల్ల వాహన చోదకులు, పాద చారులు కూడా ప్రమాదాలకు గురవుతున్నారు. ముఖ్యం గా సాయి శార్వాణి, పెట్రోల్‌ బంకు, స్వగృహ స్వీట్స్‌, ముందున్న పెద్ద గోతుల వల్ల వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీటన్నిటినీ గాంధీ స్మారక నిధి అధ్యక్షుడు ఎం. విజయ మోహన్‌రావు ఆధ్వర్యంలో సభ్యులు ఇసరాపు బాబూరావు, వెలగడ రాంబాబు, సైలాడ జాషువా, ఎం.రామకృష్ణ తదితరులు స్వచ్ఛం దంగా ఆదివారం ఉదయం సిమెంటు రాళ్లు, కంకర మట్టి, ఇసుక సేకరించి గోతుల్ని పూడ్చారు. ఈ సంద ర్భంగా అధ్యక్షుడు విజయ మోహన్‌ రావు మాట్లాడుతూ ప్రతి ఆదివారం ఉదయం 6 నుంచి 7 వరకు తమ గాంధీ స్మారక నిధి సభ్యులు శ్రమదానం చేస్తూ రోడ్లపై ఉన్న గుంతల్ని పూడ్చే కార్యక్రమం చేపడుతున్నామ న్నారు. యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ ప్రాంతంలోని రోడ్ల మీద వున్న గొయ్యిలను పూడిస్తే అనేక ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు. శ్రమ దానం చేసి గొయ్యిలను కప్పిన గాంధీ స్మారక నిధి సభ్యులకు వాహన చోదకులు కృతజ్ఞతలు తెలిపారు.

➡️