గోడౌన్లో పసుపు తరలింపుపై ఫిర్యాదు

Mar 21,2024 21:48

సబ్‌ కలెక్టర్‌కు వినతిపత్రం ఇస్తున్న పసుపు రైతుల సంఘం నాయకులు, రైతులు
ప్రజాశక్తి – తెనాలి, దుగ్గిరాల :
దుగ్గిరాల శుభం మహేశ్వరీ కోల్డ్‌ స్టోరేజ్‌ అగ్ని ప్రమాదం సంభవించి పసుపు నష్టపోయిన రైతులకు 62 రోజులు గడుస్తున్నా ఎలాంటి పరిహారం అందలేదని, పైగా గోడౌన్లో సీజ్‌ చేసిన పసుపును యజమాని అక్రమంగా తరలిస్తున్నాడని సబ్‌ కలెక్టర్‌ ప్రకర్‌ జైన్‌కు పసుపు రైతుల సంఘం నాయకులు గురువారం ఫిర్యాదు చేశారు. గోదామును తక్షణమే సీజ్‌ చేయాలని కోరారు. స్పందించిన సబ్‌ కలెక్టర్‌ దుగ్గిరాల తహశీల్దార్‌తో మాట్లాడి గోడౌన్‌ను సీజ్‌కు ఆదేశించారు. బాధిత రైతుల సంఘం కన్వీనర్‌ వేములపల్లి వెంకటరామయ్య, కో-కన్వీనర్‌ ములకా శివసాంబిరెడ్డి మాట్లాడుతూ పంట నష్టపోయిన రైతాంగానికి ఇప్పటికి పరిహారం అందలేదని, బీమా కూడా ఎంత వస్తుందనేది కూడా స్పష్టత లేదని చెప్పారు. ఇప్పటికైనా రైతులకు న్యాయం చేయాలని కోరారు. ఇదిలా ఉండగా బాధిత రైతులకు న్యాయం కోసం నాయకులు, రైతులు తహశీల్దార్‌ కె.రవిబాబుకు వినతిపత్రం ఇచ్చారు. ప్రమాదం జరిగి 62 రోజులైనా రైతులకు జరిగిన నష్టం ప్రభుత్వం గాని, యజమాని గాని, బీమా కంపెనీ నుండి గాని అందించలేదని ఆవేదన వెలిబుచ్కారు. పైగా కోల్డ్‌ స్టోరేజ్‌ యజమాని తమ వ్యాపార కార్యకలాపాలు నిర్వహించుకుంటున్నారని చెప్పారు. గోడౌన్‌లోని పసుపు పాలిష్‌ చేసుకుంటూ యథావిధిగా తన కార్యక్రమాలు కొనసాగిస్తున్నాడన్నారు. రైతులకు జరిగిన నష్టానికి బాధ్యత వహించకుండా మోసం చేస్తున్నారని అన్నారు. వినతిపత్రాలిచ్చిన వారిలో నాదెళ్ల సురేంద్ర, వెనిగళ్ల శివయ్య, పోతురాజు కోటేశ్వరరావు, కొల్లి రమేష్‌, వి.రమేష్‌, కె.రామచౌదరి, ఎన్‌.వి.శివరామకృష్ణ, శ్రీనివాసరావు ఉన్నారు.

➡️