గ్రామీణులకు మెరుగైన వైద్యం

Feb 17,2024 21:22

ప్రజాశక్తి – మక్కువ: హెల్త్‌ వెల్నెస్‌ కేంద్రాల్లో గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా మలేరియా అధికారి(డిఎంఒ) డాక్టర్‌ టి. జగన్‌ మోహనరావు సూచించారు. మండలంలో వెంకటబైరిపురం, కాశీపట్నం వెల్నెస్‌ కేంద్రాలను శనివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగుల ఆరోగ్య తనిఖీ రికార్డులు పరిశీలించి ప్రతీ రోజు ఎంతమంది, ఏ విధమైన ఆరోగ్య సమస్యలతో వస్తున్నారు, వారికి అందజేస్తున్న చికిత్స వివరాలు పరిశీలించారు. పలు ఆరోగ్య కార్యక్రమాలకు నిర్దేశించిన రికార్డులు, రిజిస్టర్స్‌ తనిఖీ చేసి వివరాలు పూర్తి స్థాయిలో, పక్కగా నమోదు చేయాలని ఆదేశించారు. దీర్ఘ కాలిక రోగుల ఆరోగ్యం ఏ మేరకు కుదుటపడుతుందో పర్యవేక్షించాలన్నారు. జ్వరాలు గుర్తిస్తే వెంటనే నిర్ధారణ పరీక్షలు జరపాలన్నారు. కేంద్రంలో మందులు, వైద్య పరీక్షలు, పరికరాలు తనిఖీ చేశారు. డాక్టర్‌ జగన్మోహనరావు మాట్లాడుతూ గ్రామీణ స్థాయిలో ప్రజలకు అన్ని రకాల సాధారణ రోగాలకు చికిత్స అందుబాటులో ఉంచే లక్ష్యంగా ప్రతీ గ్రామ సచివాలయం పరిధిలో ప్రభుత్వం హెల్త్‌ వెల్నెస్‌ కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు. ఇందులో 105 రకాల మందులు, 14 రకాల పరీక్షలు అందుబాటులో ఉన్నాయన్నారు. వెల్నెస్‌ కేంద్రాల సేవలు మరింత పటిష్టం చేసేందుకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ చర్యలు చేపడుతుందన్నారు. కెజిబివి వసతి గృహం సందర్శన : అనంతరం డాక్టర్‌ జగన్‌ మోహన్‌రావు కాశీపట్నంలో కెజిబివి వసతి గృహాన్ని సందర్శించి విద్యార్థుల ఆరోగ్య వివరాల రికార్డులు, సిక్‌ రిజిష్టర్‌ తనిఖీ చేశారు. విద్యార్ధుల్లో ఎవరికైనా జ్వరాలు, ఇతర ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా అని అక్కడ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ప్రాథమిక చికిత్స నిమిత్తం అక్కడ ఉంచిన మందులను తనిఖీ చేశారు. విద్యార్ధులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిశీలన చేసి, పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎం విజయనాగ దుర్గ, వెల్నెస్‌ కేంద్రాల సిహెచ్‌ఒలు విజయకుమార్‌, శోబిత, భారతి, ఆశా కార్యకర్తలు తదితరులున్నారు.వైద్య సేవలు మెరుగ్గా అందాలి :డిఐఒగుమ్మలక్ష్మీపురం: గిరిజన గ్రామాల్లో మెరుగైన వైద్యసేవలందించాలని జిల్లా ఇమ్యూనైజేషన్‌ అధికారి (డిఐఒ) డాక్టర్‌ ముటక నారాయణ వైద్యసిబ్బందికి సూచించారు. వైద్య బందంతో కలిసి మండలంలోని చెముడుగూడను శనివారం సందర్శించారు. ముందుగా అక్కడ చిన్నారులకు, గర్భిణీలకు వైద్య సిబ్బంది వ్యాధినిరోధక టీకా వేయడాన్ని పరిశీలించారు. గ్రామంలో గర్భిణులు ఎంతమంది, ఐదేళ్లలోపు పిల్లలు ఎంతమంది ఉన్నారు, వారిలో నవజాత శిశువుల వివరాలు, వారి ఆరోగ్య స్థితి, వ్యాక్సినేషన్‌, గ్రామంలో జ్వరాలతో ఎవరైనా ఉన్నారా తదితర అంశాలపై సిబ్బందిని ఆరా తీశారు. అక్కడకి వచ్చిన గర్భిణీ, బాలింతలకు చిన్న పిల్లల ఆరోగ్య గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం గుమ్మగడబవలసలో సందర్శించి, అక్కడ రక్తం తక్కవగా ఉన్న గర్భిణులను 102 ను రప్పించి పిహెచ్‌సికి ఆయన దగ్గర ఉండి పంపారు. ఇంకా ఎవరైనా అయిన రక్త హీనత ఉన్న గర్భిణులుంటే 102ని పిలిచి వారికి పిహెచ్‌సికి పంపించాలని వైద్య సిబ్బందికి వారు సూచించారు. జ్వర లక్షణాలున్న ఉన్న వారు వైద్య సిబ్బంది నిర్ధారణ పరీక్షలు చేసి, అవసరమైన మందులు ఇవ్వాలని వారు సూచించారు. కార్యక్రమంలో సూపర్‌ వైజర్లు జయగౌడ్‌, యారయ్యమ్మ, ఎఎన్‌ఎం భాగ్యలక్ష్మి, దమయంతి, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.

➡️