గ్రామీణ సమస్యలపై ప్రజా ఉద్యమం

ప్రజాశక్తి – కడప అర్బన్‌ ప్రధానమంత్రి మోడీ కపట ప్రేమ నమ్మే స్థితిలో రైతులు లేరని, గ్రామీణ సమస్యలపై ప్రజా ఉద్యమం చేపడతామని సిపిఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్‌ హెచ్చరించారు. శుక్రవారం పాత బస్టాండ్‌ మహాత్మా జ్యోతిరావు పూలే సర్కిల్‌లో ఢిల్లీ రైతు ఉద్యమంలో అమరుడైన శంభోకరన్‌ సింగ్‌కు వామపక్ష, అఖిలపక్ష పార్టీలు సంయుక్తంగా నిరసన ఆందోళన నిర్వహించి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్‌, సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర, జనతాదళ్‌ జిల్లా అధ్యక్షులు ప్రతాప్‌ రెడ్డి మాట్లాడుతూ 2020 లో ఢిల్లీ కేంద్రంగా ఐక్య రైతు సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో స్వామినాథన్‌ కమిషన్‌ సిఫారసుల అమలు చేయాలని ఒక ఏడాది పైగా దేశ రాజధానిలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన రైతాంగం కఠోర ఉద్యమం నిర్వహించారని పేర్కొన్నారు. ఫలితంగా, రైతుల ప్రాణార్పణతో దిగివచ్చిన కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతు సంఘాల నాయకులతో చర్చలు జరిపి, బిజెపి పార్లమెంటులో తెచ్చిన రైతు వ్యతిరేక మూడు నల్ల చట్టాలను వెనక్కు తీసుకుందని తెలిపారు. స్వామినాథ్‌ కమిషన్‌ ప్రధాన సిఫారసులైన రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర, పెట్టిన పెట్టుబడికి అదనంగా 50 శాతం ప్రభుత్వం చట్టబద్ధంగా కల్పించాలని చెప్పారు. దేశీయ రైతులు పండించిన ఆహార ఉత్పత్తులు మార్కెట్‌ చేసుకోవటానికి అనుగుణంగా, విదేశీ ఆహార ఉత్పత్తుల దిగుమతి పై చట్టపరమైన ఆంక్షలు ఉండాలని తెలిపారు. దేశ ప్రజలకు తిండి పెట్టే రైతులకు, వ్యవసాయ కూలీలకు పెన్షన్‌ సౌకర్యం ప్రభుత్వం ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. ఫైరింగ్‌ చేయటం, రైతుల ప్రాణాలను బలి తీసుకోవడం చూస్తుంటే బిజెపి ప్రభుత్వం దేశ ప్రజలపై యుద్ధం ప్రకటించిన తీరుగా ఉందని పేర్కొన్నారు. మోడీకి ఊడిగం చేసే జనసేన, టిడిపి, వైసిపిలకు ప్రజలు వారి రాజకీయ చైతన్యంతో బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరించారు. దీనికి ఏప్రిల్‌ లో జరగబోయే దేశ 18వ సార్వత్రిక ఎన్నికలు కాబోతున్నాయన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఏ.రామ్మోహన్‌, జిల్లా కమిటీ సభ్యులు వి.అన్వేష్‌, కె.శ్రీనివాసులు రెడ్డి, బి. దస్తగిరిరెడ్డి, సిపిఎం నాయకులు జి.ఓబులేసు, చంద్రారెడ్డి , రాజేంద్ర, సిపిఐ జిల్లా సీనియర్‌ నాయకులు ఎల్‌. నాగ సుబ్బారెడ్డి, బాదుల్లా, వెంకట శివ, భాగ్యమ్మ , మద్దిలేటి పాల్గొన్నారు.రైతులపై కాల్పులను వ్యతిరేకిస్తూ ధర్నా ఢిల్లీ సరిహద్దుల్లో మద్దతు ధర చట్టం చేయమని, మోడీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని, పోరాటం సందర్బంగా చనిపోయిన రైతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ రెండవ దఫా రైతాంగం మొదలుపెట్టిన ఉద్యమంపై హర్యానా బిజెపి ప్రభుత్వం పోలీసులతో కాల్పులు జరిపించి యువరైతును బిజెపి ప్రభుత్వం బలి తీసుకుందని సిఐటియు, ఎఐటియు నాయకులు పేర్కొన్నారు. బిజెపి ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ శుక్రవారం ఎఐటియుసి, సిఐటియు నగర కమిటీ ఆధ్వర్యంలో ఆర్‌డిఒ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో ఎఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్‌. నాగసుబ్బారెడ్డి, సిఐటియు జిల్లా కార్యదర్శి మనోహర్‌ ఎఐటియుసి జిల్లా డిప్యూటీ సెక్రెటరీ బాదుల్లా, సిఐటియు జిల్లా అధ్యక్షులు కామనూరు శ్రీనివాసులు రెడ్డి, ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి దస్తగిరి రెడ్డి, వ్యవసాయం కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి అన్వేష్‌, సిఐటియు నగర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చంద్రారెడ్డి, వెంకటసుబ్బయ్య, డివైఎఫ్‌ఐ నగర కార్యదర్శి డి. ఎం. ఓబులేసు, ఏపీ రైతు సంఘం జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మనోహర్‌ రెడ్డి, జిల్లా నాయకులు యానాదయ్య, ఎఐటియుసి, సిఐటియు నగర నాయకులు పాల్గొన్నారు. పోరుమామిళ్ల : పోలీస్‌ కాల్పులలో చనిపోయిన యువ రైతుకు వెంటనే ఎక్స్‌ గ్రేషియా ప్రకటించాలని సిపిఎం మండల కార్యదర్శి భైరవ ప్రసాద్‌ పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం పట్టణంలోని అంబేద్కర్‌ సర్కిల్‌లో సిపిఎం ఆధ్వర్యంలో రైతాంగ పోరాటానికి మద్దతుగా నిరసన తెలియజేశారు. కార్యక్రమంలో సిపిఎం, సిఐటియు నాయకులు రవి, బీబి, శ్రీనివాసులు, రామకష్ణ, ముత్యాల చెన్నయ్య. ప్రకాశం, షరీఫ్‌, స నాయకులు పాల్గొన్నారు. ప్రొద్దుటూరు : తాము ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించమని రైతులు అడుతుంటే వారి న్యాయమైన కోరికను తీర్చకుండ వారిపట్ల కర్కషంగా వ్యవహరిస్తూ యువరైతు ప్రాణం తీయడం బిజెపికి సిగ్గుచేటని సిఐటియు జిల్లా కార్యదర్శి సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీ కాల్పుల్తో మృతి చెందిన యువరైతుకు మద్దతుగా సిఐటియు ఆధ్వర్యంలో స్థానిక రాజీవ్‌సర్కిల్‌లో శుక్రవారం నిరసన కార్యక్రమం కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో మున్సిపల్‌ యూనియన్‌ కార్యదర్శి సాల్మన్‌ అధ్యక్షులు చంటి రవి శేఖర్‌ చెన్నారెడ్డి, సర్వేశ్వరి, రాములమ్మ, వెంకటేష్‌, శీను, హరి పాల్గొన్నారు.

➡️