ఘనంగా ఇన్‌స్పైర్‌ ఎగ్జిబిషన్‌

Feb 15,2024 20:45

 ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : జిల్లా స్థాయి ఇన్‌స్పైర్‌ సైన్స్‌ ఎగ్జిబిషన్‌ గురువారం పూల్‌బాగ్‌లో చలపతి ఇంగ్లీషు మీడియం స్కూల్‌లో ఘనంగా ప్రారంభమైంది. ఎంపి బెల్లాన చంద్ర శేఖర్‌, డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి ఈ ఎగ్జిబిషన్‌ను ప్రారంబించారు. ముందుగా కార్యక్రమానికి అధ్యక్షత వహించిన జిల్లా విద్యాశాఖాధికారి ఎన్‌. ప్రేమ్‌ కుమార్‌ ప్రారంభోపన్యాసం చేస్తూ ఉమ్మడి విజయనగరం జిల్లా స్థాయిలో 2022-23 సంవత్సరంలో మంజూరైన 120 ప్రాజెక్టులు, పార్వతీపురం మన్యం జిల్లా నుంచి 60 ప్రాజెక్టులు ప్రదర్శనలో పాల్గొన్నట్లు తెలిపారు. వీటిలో పది శాతం ప్రదర్శనలు రాష్ట్రస్థాయికి ఎంపికవుతాయని తెలిపారు. విద్యార్థుల్లో సృజనాత్మకత, వినూత్న ఆలోచనలు, శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశమన్నారు. మేయర్‌ వెంపడాపు విజయలక్ష్మి మాట్లాడుతూ, విద్యార్థులు విద్యతోపాటు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని తెలిపారు. ఎంపి బెల్లాన చంద్రశేఖర్‌ మాట్లాడుతూ విద్యార్థులు ఇటువంటి సైన్స్‌ ఎగ్జిబిషన్లలో పాల్గొనడం ద్వారా, ఎన్నో కొత్త విషయాలు నేర్చుకొని, శాస్త్రీయ ఆలోచనలను జోడిస్తూ, అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ న్యూఢిల్లీ నుంచి డాక్టర్‌ కె. మహిమ పరిశీలకులుగా పాల్గొన్నారు, డిసిఇబి సెక్రటరీ సన్యాసి రాజు, జిల్లా సైన్స్‌ ఆఫీసర్‌ ఎం.కృష్ణారావు, వివిధ పాఠశాల నుంచి సైన్స్‌ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

➡️