ఘనంగా ఎంవిఎస్‌కె స్కూల్‌ వార్షికోత్సవం

Mar 28,2024 22:31

బెస్ట్‌ పెర్‌ఫార్మెన్స్‌ అవార్డులు అందుకున్న విద్యార్థులతో కెఎస్‌ లక్ష్మణరావు, తదితరులు
ప్రజాశక్తి-గుంటూరు :
స్థానిక 41వ డివిజన్‌, పుచ్చలపల్లి సుందరయ్య నగర్‌లోని ప్రొఫెసర్‌ ఎంవిఎస్‌ కోటేశ్వరరావు మెమోరియల్‌ స్కూల్‌ 8వ వార్షికోత్సవం గురువారం ఘనంగా నిర్వహించారు. ఉదయం నుండి సాయంత్రం వరకూ విద్యాపరమైన అంశాలపై డ్రామా, స్కిట్‌, నృత్య రూపకాల ద్వారా చేసిన ప్రదర్శనలు ఎంతో ఆకట్టుకున్నాయి. తొలుత నిర్వహించిన సభలో స్కూల్‌ కమిటీ ప్రెసిడెంట్‌ అయిన ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు ప్రసంగించారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ప్రొఫెసర్‌ ఎంవిఎస్‌ కోటేశ్వరరావు ఆశయం ద్వారా ఈ స్కూల్‌ ఏర్పడిందన్నారు. ఆ తర్వాత అనేక మంది ఆంధ్రా యూనివర్సిటీ పూర్వ విద్యార్థులు, దాతల సహకారంతో దినదినాభివృద్ది చెందుతోందని చెప్పారు. ఈ ప్రాంతంలోని పేద పిల్లలకు నామమాత్రపు ఫీజుతో అత్యంత నాణ్యమైన విద్యను అందిస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఆధునిక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌ వైద్యులు డాక్టర్‌ శిల్పా సింధూర, డాక్టర్‌ ప్రత్యూష వీర్నాల పాల్గొని పేద విద్యార్థుల కోసం సేవా దృక్పథంతో పాఠశాల నిర్వహించటం అభినందనీయమని కొనియాడారు. ఈ సందర్భంగా పదో తరగతి టాపర్‌ అమృత, 9వ తరగతి టాపర్‌ భాగ్యలక్ష్మికి ప్రోత్సాహక బహుమతులుగా రూ.10 వేలు చొప్పన అందజేశారు. కార్యక్రమానికి ఎన్‌.తాండవకృష్ణ అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో స్కూల్‌ సెక్రెటరీ అండ్‌ కరస్పాండెంట్‌ ఎం.ఉపేంద్ర, ఇండియన్‌ బ్యాంకు రిటైర్డ్‌ జిఎం సోమయాజులు, పలువురు రిటైర్డ్‌ అధికారులు, మానవతా సంస్థ నుండి పావులూరి రమేష్‌, స్కూల్‌ అడ్మినిస్ట్రేటర్‌ ఎల్‌.ఎస్‌.భారవి, టి.వినోద, వైస్‌ప్రిన్సిపాల్‌ దివ్య పాల్గొన్నారు.
సాంస్కృతిక ప్రదర్శనలిస్తున్న విద్యార్థినీ విద్యార్థులు

➡️