ఘనంగా జాతీయ ఓటర్ల దినోత్సవం

Jan 25,2024 20:09

  ప్రజాశక్తి-విజయనగరం  : జాతీయ ఓటర్ల దినోత్సవ స్ఫూర్తిని చాటిచెప్పేలా, ఓటుహక్కు ప్రాముఖ్యతను వివరిస్తూ 14వ జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. ఓటుహక్కు ప్రాధాన్యతను వివరిస్తూ ర్యాలీలు, నినాదాలతో పుర వీధులు మారుమ్రోగాయి. జాయింట్‌ కలెక్టర్‌ మయూర్‌ అశోక్‌ ముఖ్య అతిధిగా హాజరై, అయోద్యా మైదానంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఐ ఓట్‌ ఫర్‌ ష్యూర్‌ నినాదాన్ని మానవ హారంతో ప్రదర్శించారు. విద్యార్థులు విన్యాసాలు చేశారు. బెలూన్లు ఎగురవేసి స్ఫూర్తిని చాటారు. మైదానం చుట్టూ విద్యార్థులు జాతీయ పతాకాలతో మానవహారం నిర్వహించారు. పులివేషాలు, కోలాటం, విచిత్ర వేషాలు, డప్పుల చప్పుడుతో మైదానం హౌరెత్తిపోయింది. అక్కడినుంచి భారీ ప్రదర్శన నిర్వహిస్తూ గురజాడ కళాక్షేత్రానికి చేరుకున్నారు.ఓటుహక్కు వినియోగించుకోవడం మన బాధ్యత ఓటు హక్కు వినియోగించుకోవడం ప్రతీ పౌరుని బాధ్యత అని జాయింట్‌ కలెక్టర్‌ మయూర్‌ అశోక్‌ అన్నారు. గురజాడ కళాక్షేత్రంలో జరిగిన జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ప్రజాస్వామ్య మనుగడకు, దేశాభివద్దికి ఓటు మూలస్థంభం లాంటిదని పేర్కొన్నారు. ఓటుహక్కు ప్రాధాన్యతను వివరించేందుకు 2011 నుంచి ప్రతీఏటా జనవరి 25ను జాతీయ ఓటర్ల దినోత్సవంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రతీఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే కాకుండా, దానిని శతశాతం వినియోగించుకొనే విధంగా ప్రతీఒక్కరికీ అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం లక్ష్యమని చెప్పారు. వచ్చే ఎన్నికలలో శాతశాతం ఓటుహక్కు వినియోగించుకొనే విధంగా ఓటర్లను చైతన్య పరుస్తామని అన్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చినప్పటికీ, అర్హత ఉన్నవారందరికీ నిబంధనల మేరకు ఓటుహక్కు కల్పిస్తామని జెసి తెలిపారు. ఈ సందర్భంగా స్వీప్‌ కార్యక్రమం కేలండర్‌ను ఆవిష్కరించారు. ప్రచార రథాన్ని ప్రారంభించారు. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని, విజయనగరం కోట చుట్టూ మానవ హారాన్ని ఏర్పాటు చేశారు. ప్రతిజ్ఞ చేయించారు. భారత ముఖ్య ఎన్నికల నిర్వహణ అధికారి రాజీవ్‌ కుమార్‌ సందేశాన్ని వినిపించారు. సీనియర్‌ ఓటరు మురళీలాల్‌ శర్మ, యువ ఓటర్‌ ఆదాడ మనోహర్‌, విభిన్న ప్రతిభావంతుడు డి.కొండబాబు, ట్రాన్స్‌ జెండర్‌ డి.మీనాలను సన్మానించి, ప్రశంసాపత్రాలను అందజేశారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో ప్రశంసనీయంగా పనిచేసిన ఇఆర్‌ఒలు, ఎఇఆర్‌ఒలు, ఎన్నికల డిటిలు, సూపర్‌వైజర్లు, కంప్యూటర్‌ ఆపరేటర్లు తదితర 59 మందికి ప్రశంసా పత్రాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన పులివేషాలు, కోలాటం, సాంస్కతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కళాకారులను, ఆహుతులను జ్ఞాపికలతో సత్కరించారు. కార్యక్రమంలో అసిస్టెంట్‌ కలెక్టర్‌ వెంకట త్రివినాగ్‌, డిఆర్‌ఓ ఎస్‌డి అనిత, ఆర్‌డిఓ ఎం.వి.సూర్యకళ, స్పెషల్‌ డిప్యుటీ కలెక్టర్లు సుదర్శనదొర, నూకరాజు, జెడ్‌పి సిఇఓ కె.రాజ్‌కుమార్‌, మెప్మా పీడీ సుధాకరరావు, విజయనగరం తాహశీల్దార్‌ కోరాడ శ్రీనివాసరావు, పలువురు జిల్లా అధికారులు, పిఇటిలు, విద్యార్ధులు, డ్వాక్రా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

➡️