చలో ఢిల్లీకి మద్దతుగా ప్రదర్శనలు

Mar 14,2024 23:01

ప్రజాశక్తి – వినుకొండ : పట్టణంలోని కారంపూడి రోడ్డులో రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. సంఘం అధ్యక్షులు వి.కృష్ణయ్య మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం వ్యసాయం నుండి రైతులను దూరం చేయాలని చూస్తోందని, ఆ భూములను కార్పొరేట్లకు కట్టబెట్టాలనుకుంటోందని అన్నారు. అందుకే మూడు వ్యవసాయ నల్ల చట్టాలు తెచ్చిందన్నారు. వీటికి వ్యతిరేకంగా జరిగిన ఢిల్లీ రైతు ఉద్యమానికి తలొగ్గిన కేంద్రం పలు హామీలిచ్చిన వాటిని విస్మరించిందని విమర్శించారు. కార్మికవర్గంపైనా కేంద్రం దాడికి పూనుకుందని, నాలుగు లేబర్‌ కోడ్‌లు అందుకు నిదర్శనమని చెప్పారు. రైతు, కార్మిక వ్యతిరేక విధానాలకు స్వస్థి పలకాలని, పంటలకు కనీస మద్దతు ధర చట్టం చేయాలని, నాలుగు లేబర్‌ కోడ్‌లు రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. రైతుల వ్యవసాయ రుణాలు రద్దు చేయాలని, ఆహార భద్రత చట్టాన్ని పటిష్టం చేయాలని కోరారు. చుక్కల భూములు అన్నిటికి పట్టాలు ఇవ్వాలన్నారు. రైతు ప్రయోజనాలకు అనుగుణంగా సమగ్ర పంటల బీమా పథకం పెట్టాలని, సాగులో ఉన్న కౌలు రైతులకే నష్టపరిహారం బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్‌ చేశారు. పల్నాడు ప్రాంతానికి జీవనాధారమైన వరికపూడిసెల ప్రాజెక్టు నిర్మాణానికి వెంటనే నిధులు కేటాయించి పనులు ప్రారంభించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సంఘం జిల్లా కార్యదర్శి ఏపూరి గోపాలరావు, ఎ.మారుతి వరప్ర సాద్‌, బి.వెంకటేశ్వరరావు, కె.హనుమంత రెడ్డి, యు.రాము పాల్గొన్నారు.

ప్రజాశక్తి – చిలకలూరిపేట : స్థానిక ఎన్‌ఆర్‌టి సెంటర్‌లోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద రైతు, కార్మిక, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. కౌలురైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వై.రాధాకృష్ణ మాట్లాడుతూ రైతులకు ఇచ్చిన హామీలను విస్మరించిన ప్రధాని మోడీ దేశ సంపద మొత్తాన్ని అదాని, అంబానీలకు తాకట్టు పెడుతున్నారని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో బిజెపిని ఓడించకుంటే దేశాన్ని, వ్యవసాయాన్ని మరింత నాశనం చేస్తుందని అన్నారు. నిరసనలో వివిధ సంఘాల నాయకులు టి.బాబురావు, డాక్టర్‌ కొల్లా రాజమోహన్‌రావు, రాధాకృష్ణ, పి.వెంకటేశ్వర్లు, బి.శంకరరావు, ఎం.ప్రతా ప్‌రెడ్డి, పి.రామారావు, శివపార్వతి, పి.భారతి, ఎం.రాధాకృష్ణ, బి.భగత్‌ సింగ్‌, ఎం.నాగేశ్వరరావు పాల్గొన్నారు.

ప్రజాశక్తి-ముప్పాళ్ల : మండల కేంద్రమైన ముప్పాళ్లలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. రైతు సంఘం పల్నాడు జిల్లా అధ్యక్షులు జి.బాలకృష్ణ మాట్లాడుతూ ఢిల్లీ రైతు ఉద్యమం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఇంధన ధరలు సహా అన్ని రకాల నిత్యావసరాల ధరలను పెంచిన కేంద్ర ప్రభుత్వం సామాన్యుల పొట్టగొడుతోందని మండిపడ్డారు. నాయకులు జి.జాలయ్య, ఎం.వెంకటరెడ్డి, టి.అమరలింగేశ్వరరావు, కె.సాంబశివరావు, పి.సైదాఖాన్‌, కె.నాగేశ్వరరావు, ఐ.సత్యనారాయణరెడ్డి, సిహెచ్‌.నాగమల్లేశ్వరరావు, టి.బ్రహ్మయ్య, టి.మస్తాన్‌రావు, డి.అప్పారావు, ఎన్‌.నాగేశ్వరరావు, టి.వెంకటేశ్వర్లు, ఎన్‌.సాంబశివరావు పాల్గొన్నారు.

ప్రజాశక్తి – సత్తెనపల్లి టౌన్‌ : స్థానిక తాలూకా సెంటర్లో అంబేద్కర్‌ విగ్రహం వద్ద సంయుక్త కిసాన్‌ మోర్చా- కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. కార్యక్రమానికి కౌలురైతు సంఘం మండల కార్యదర్శి పి.మహేష్‌ అధ్యక్షత వహించారు వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వి.శివనాగరాణి, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు గద్దె చలమయ్య మాట్లాడుతూ రైతు, కార్మిక వ్యతిరేక విధానాలను కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తోందని, మద్దతు ధరల చట్టం కోసం ఢిల్లీ సరిహద్దుల్లో పోరాడుతున్న రైతులపై పాశవిక నిర్బంధాలకు పాల్పడుతోందని మండిపడ్డారు. స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సులు ప్రకారం సి2ప్లస్‌ 50 శాతం కలిపి మద్దతు ధరల చట్టం చేయాలని డిమాండ్‌ చేశారు. రైతులకు ఉచిత విద్యుత్‌ను దూరం చేసేలా పంప్‌సెట్లకు స్మార్ట్‌ మీటర్ల బిగుంపును, విద్యుత్‌ సవరణ చట్టాలను ఉపసంహరించుకోవాలని కోరారు. గ్రామీణ ఉపాధి హామీకి కేంద్ర బడ్జెట్లో రూ.2 లక్షల కోట్లు కేటాయించాలని, ఏడాదిలో 200 పని దినాలు కల్పించడంతోపాటు రోజుకూలి రూ.600 అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ రంగ ప్రైవేటీకరణ మానుకోవాలన్నారు. కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు ఎం.జగన్నాథరావు, జి.రజిని, డి.విమల, జె.రాజ్‌కుమార్‌, ఎం.నరసింహారావు, బి.వెంకటేశ్వర్లు, జై భగత్‌, బి.రామారావు, వెంకటనారాయణ, జగన్‌, వెంకటేశ్వర్లు, సుధ పాల్గొన్నారు.

ప్రజాశక్తి – యడ్లపాడు :
చలో ఢిల్లీకి మద్దతుగా మండల కేంద్రమైన యడ్లపాడులో రైతు, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ప్రదర్శన చేపట్టారు. స్థానిక పిఆర్‌ విజ్ఞాన కేంద్రం నుండి జాతీయ రహదారి సెంటర్‌ వరకూ ప్రదర్శన సాగింది. వ్యవసాయ కార్మిక సంఘం పల్నాడు జిల్లా అధ్యక్షులు కె.రోశయ్య మాట్లాడుతూ స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సుల ప్రకారం పంటలకు మద్దతు ధర కల్పించాలని డిమాండ్‌ చేశారు. నాయకులు జి.హరిబాబు, జె.శంకరరావు, ఎన్‌.తులశయ్య, కె.సత్యనా రాయణ, వై.పుల్లయ్య, పి.సుబ్బారావు, కె.రామస్వామి, పి.సాంబశివరావు, ఎం.సీతారామయ్య, డి.శేషగిరిరావు, కె.రామారావు పాల్గొన్నారు.

ప్రజాశక్తి-పిడుగురాళ్ల : స్థానిక బ్యాంక్‌ సెంటర్‌ వద్ద రైతు, కార్మిక సంఘాలు నిరసన తెలిపాయి. సిఐటియు మండల కార్యదర్శి టి.శ్రీనివాసరావు మాట్లాడుతూ కేంద్రమోని బిజెపి ప్రభుత్వం రైతు, కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని అన్నారు. దేశ సంపదను కార్పొరేట్లకు కట్టబెడుతోందని, కార్మికులను బానిసలుగా మార్చే లేబర్‌ కోడ్‌లను తెచ్చిందని, మరోవైపు వ్యవసాయ రంగాన్ని కూడా కార్పొరేట్లకే అప్పజెప్పడానికి కుట్ర పన్నిందని మండిపడ్డారు. ఎఐటియుసి నాయకులు జె.కృష్ణ నాయక్‌ మాట్లాడుతూ బిజెపి చర్యలను కార్మికులు, రైతులు క్షమించబోరని, రానున్న ఎన్నికల్లో ఆ పార్టీని ఓడిస్తారనిఅన్నారు. భారత్‌ బచావో నాయకులు కె.నవజ్యోతి సమస్య లపై ప్రజల దృష్టి పడకుండా మత రాజకీ యాలతో జనం మధ్య చీలికలు తెస్తోందని అన్నారు. కార్యక్రమంలో బి.నాగేశ్వరరావు బి.వెంకటేశ్వర్లు, ఎ.కోటి రెడ్డి, కె.సీతారామయ్య, నాగేశ్వరరావు, అప్పయ్య, రామకృష్ణ, ఎ.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

ప్రజాశక్తి – మాచర్ల : సిపిఎం, సిటియు, ఇతర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పట్టణంలో ప్రదర్శన, అనంతరం తహశీల్దార్‌ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. సిపిఎం పల్నాడు జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎస్‌.ఆంజనేయులునాయక్‌ మాట్లాడుతూ రైతు వ్యతిరేకి మోడీ ప్రభుత్వాన్ని రానున్న ఎన్నికలలో గద్దె దించేందుకు రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కూలీలు, అన్ని రంగాల కార్మికుల కుటుంబాలు సిద్ధమవ్వాలని పిలుపునిచ్చారు. రైతుల ప్రయోజనాలకు అనుగుణంగా సమగ్ర పంటల బీమా పథకాన్ని అమలు చేయాలన్నారు. సిటియు నాయకులు పి.అబ్రహంలింకన్‌ మాట్లాడుతూ నాలుగు లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలని, కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు అమలు చేయాలని కోరారు. వరికపూడిశెల ప్రాజెక్ట్‌కు నిధులు కేటయించి నిర్మాణ పనులను చేపట్టాలన్నారు. ఆందోళనలో నాయకులు వై.సురేష్‌, పి.శ్రీను, జి.శ్రీను, కె.వెంకటరత్నం, రమణ, కోటేశ్వరి, నారాయణమ్మ, నాగేశ్వరి, పున్నమ్మ, తిరుపతమ్మ పాల్గొన్నారు.

➡️