చలో ఢిల్లీకి మద్దతుగా 14న ఆందోళనలు

 మాచర్ల: దేశ జనాభాలో 70 శాతంగా ఉన్న రైతు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికుల సమస్యల పరిష్కరంలో కేంద్ర ప్రభుత్వం లిఖితపూర్వకంగా ఇచ్చిన హమీలను అమలు చేయలేదని రైతుసంఘ రాష్ట్ర అధ్యక్షులు వి.కృష్ణయ్య విమర్శించారు. స్థానిక శ్రీ కోదండ రామాలయంలో గురువారం జరిగిన అభిలపక్ష సంఘాల రౌండ్‌ టేబుల్‌ సమావేశానికి సిపిఎం నాయకులు బి.మహేష్‌ అధ్యక్షత వహించారు. కృష్ణయ్య మాట్లాడుతూ మూడు వ్యవసాయ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా 540 రైతు సంఘాలతో కూడిన సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కెఎం) ఆధ్వర్యంలో రైతులు ఢిల్లీలో పోరాడిన సందర్భంగా అనేక మంది రైతులు ప్రాణాలు కోల్పోయారని, ఈ క్రమంలో రైతు పోరాటానికి దిగొచ్చిన కేంద్ర ప్రభుత్వం లిఖితపూర్వకంగా హాలిచ్చినా వాటిని విస్మరించింద్నఇ అన్నారు. పైగా ఆ నల్ల చట్టాలనే దొడ్డిదారిన అమలు చేసి వ్యవసాయాన్ని కార్పొరేట్ల పరం చేస్తోందని మండిపడ్డారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా ఈనెల 14న చలో ఢిల్లీకి ఎస్‌కెఎం పిలుపునిచ్చినట్లు తెలిపారు. ఢిల్లీ రామ్‌లీలా మైదానంలో జరిగే భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరారు. ఈ ఆందోళనకు మద్దతుగా అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో ఆందోళన చేపట్టాలని కోరారు. స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సును అమలు చేసి, పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, రైతుల రుణాలను మాఫీ చేయాలని, కేరళ తరహ రుణ ఉపశమన చట్టాలు తేవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఉపాధి హమీకి కేంద్ర బడ్జెట్‌లో రూ.2 లక్షల కోట్లు కేటాయించి, రోజువారీ కూలి రూ.600కు పెంచాలని, ఏడాదికి 200 పనిదినాలు కల్పించాలని కోరారు. ఆహార భద్రత చట్టాన్ని పటిష్ఠ పరచాలన్నారు. అనంతరం సిపిఐ నాయకులు ఎం.బాబురావు, సిటియు నాయకులు అబ్రహం లింకన్‌, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు జాని, బిఎస్‌పి నాయకులు సైదులు యాదవ్‌ మాట్లాడారు. సురేష్‌, శోభన్‌కుమార్‌, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

➡️