‘చలో విజయవాడ’ జయప్రదానికి పిలుపు

Feb 6,2024 21:54
ఫొటో : మాట్లాడుతున్న సిఐటియు నాయకులు చాన్‌బాషా

ఫొటో : మాట్లాడుతున్న సిఐటియు నాయకులు చాన్‌బాషా
‘చలో విజయవాడ’ జయప్రదానికి పిలుపు
ప్రజాశక్తి-ఇందుకూరుపేట : ఆశావర్కర్ల యూనియన్‌ ఆధ్వర్యంలో 8వ తేదీన జరిగే చలో విజయవాడ కార్యక్రమానికి అందరూ హాజరై జయప్రదం చేయాలని సిఐటియు నాయకులు చాన్‌బాషా కోరారు. మంగళవారం మండలంలోని మైపాడు గ్రామంలో ఆశ వర్కర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా సిఐటియు ఇందుకూరుపేట మండల నాయకులు చాన్‌బాషా సిపిఎం మండల కార్యదర్శి మైపాటి కోటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కనీస వేతనం, బీమా సౌకర్యం, రిటైర్మెంట్‌ బెనెఫిట్స్‌, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని ఆశావర్కర్లు 8వ తేదీన చలో విజయవాడ కార్యక్రమంలో అధికసంఖ్యలో ఆశావర్కర్లు పాల్గొని విజయవాడలో జరిగే మహాధర్నాను జయప్రదం చేయాలన్నారు. వైసిపి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత ఆశావర్కర్లపై విపరీతమైన పని భారం పెరిగిందన్నారు. పదివేల వేతనంతో 24 గంటలు వెట్టి చాకిరి చేపిస్తున్నారు. ఇతర సిబ్బంది చేయాల్సిన అనేక పనులను బెదిరించి వేధించి ఆశావర్కర్లతో చేయిస్తున్నారు. విధి నిర్వహణలో నెలకు రూ.3వేల నుండి రూ.4వేలు వారి చేతి డబ్బులు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రభుత్వం ఇచ్చిన సెల్‌ఫోన్లు పనిచేయకపోవడంతో సొంత ఫోన్లు కొని పని చేయాలని లేకుంటే ఉద్యోగాల నుండి తొలగిస్తామని అధికారుల బెదిరింపులు ఎక్కువయ్యాయన్నారు. అధికార పూర్వకంగా నాలుగు యాపులు అనధికారికంగా 10 యాప్‌ల ద్వారా పనిచేయిస్తున్నారు. ఆన్‌లైన్‌ వర్క్‌తో పాటు 26 రకాల రికార్డ్‌ కొని రాయాలని హింసిస్తున్నారు. పని ఒత్తిడి తట్టుకోలేక ఆశ వర్కర్లు తీవ్ర ఒత్తిడికి గురై అర్ధాంతరంగా అనేకమంది చనిపోయారు. వారికి ప్రభుత్వం కనీసం నష్టపరిహారం కూడా చెల్లించడం లేదన్నారు. ఆశావర్కర్లకు రూ.10 లక్షల ఇన్సూరెన్స్‌ సౌకర్యం కల్పించాలని, సెలవులు, వేతనంతో కూడిన మేటర్నిటీ సెలవులు, అలాగే రిటైర్‌ అయిన వారికి రిటైర్మెంట్‌ బెనెఫిట్స్‌ ఇవ్వాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఆశావర్కర్లకు కూడా వర్తింప చేయాలన్నారు.ఈ సమస్యల పరిష్కారం కోసం ఫిబ్రవరి 8న విజయవాడలో జరిగే మహాధర్నాలో ఆశా వర్కర్లు అందరు పాల్గొని జయప్రదం చేయాలన్నారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులతోపాటు ఆశావర్కర్స్‌ యూనియన్‌ ఇందుకూరుపేట మండల కృష్టమ్మ, అమ్మని, సుజాత, ప్రమీల, ధనమ్మ, వసంత, జ్యోతి, ఆశావర్కర్లు పాల్గొన్నారు.

➡️