చింతపల్లిలో శాశ్వత ఫిషింగ్‌ జెట్టీ ఏర్పాటు

Jan 6,2024 21:17

 ప్రజాశక్తి-పూసపాటిరేగ  :  చింతపల్లిలో శాశ్వత ఫిషింగ్‌ జెట్టీ ఏర్పాటు చేస్తామనికేంద్ర మత్స్యశాఖ మంత్రి పర్షోత్తమ్‌ రూపాల తెలిపారు. కేంద్రం మత్స్యకారుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పలు పథకాలు వారికి ఏవిధంగా చేరుతున్నాయనే అంశాన్ని పరిశీలించే లక్ష్యంతో చేపట్టిన సాగర పరిక్రమలో భాగంగా చింతపల్లిలో కేంద్ర మత్స్య, పశుసంవర్ధక శాఖ మంత్రి పర్షోత్తమ్‌ రూపాల, సహాయ మంత్రి ఎల్‌.మురుగన్‌లు శనివారం పర్యటించారు. సముద్రతీరంలో చేపలు విక్రయిస్తున్న మహిళలతో మాట్లాడి వాటి విక్రయం ద్వారా ఎంత ఆదాయం వస్తుందని ఆరా తీశారు. మత్స్యకార ప్రతినిధులు, లబ్దిదారులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మత్స్యకార సహకార సంఘం అధ్యక్షుడు బర్రి చిన్నప్పన్న, రాము తదితరులు తమ ప్రాంతానికి ఫ్లోటింగ్‌ జెట్టీ కాకుండా శాశ్వత స్థాయి జెట్టీ మంజూరు చేయాలని కోరారు. దీనిపై కేంద్ర మంత్రి స్పందిస్తూ చింతపల్లి మత్స్యకారులకు శాశ్వత జెట్టీని మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. మత్స్యకారులు ఉపాధి అవసరాల కోసం వలసలు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇక్కడే శాశ్వత జెట్టీ ఏర్పాటు చేస్తామన్నారు. కేంద్ర మత్స్య, పశుసంవర్ధక శాఖల సహాయమంత్రి ఎల్‌.మురుగన్‌ మాట్లాడుతూ మత్స్యసంపద యోజన కింద రూ.20 వేల కోట్లతో మత్స్యకారుల కోసం పలు పథకాలు అమలు చేస్తున్నట్టు చెప్పారు. కలెక్టర్‌ నాగలక్ష్మి మాట్లాడుతూ జిల్లాలో మత్స్యకారులకు రూ.24 కోట్లతో ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్‌ కూడా ఏర్పాటు చేస్తున్నామని, అది ప్రస్తుతం టెండరు దశలో వుందన్నారు. ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు మాట్లాడుతూ మత్స్యకారులు పక్కా ఇళ్లు నిర్మించుకొనేందుకు ఒక పథకం ప్రారంభిస్తే బాగుంటుందని సూచించారు. కార్యక్రమంలో కేంద్ర మత్స్యశాఖ సంయుక్త కార్యదర్శి నీతూ ప్రసాద్‌, మత్స్యశాఖ డిడి నిర్మలా కుమారి, ఆర్‌డిఒ ఎంవి సూర్యకళ, పశుసంవర్ధక శాఖ జెడి విశ్వేశ్వరరావు, డిడి రమణ, తహశీల్దార్‌ భాస్కరరావు, బిజెపి జిల్లా అధ్యక్షులు నడికుదిటి ఈశ్వరరావు, శ్రీకాకుళం జిల్లా బిజెపి అధ్యక్షులు బి.ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌

భోగాపురం : 2047 నాటికి భారత దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని కేంద్ర పశు సంవర్థక, మత్స్య, పాడి పరిశ్రమ శాఖల సహాయ మంత్రి డాక్టర్‌ ఎల్‌.మురుగన్‌ అన్నారు. చెరుకుపల్లి గ్రామంలో నిర్వహించిన వికసిత్‌ భారత్‌ సంకల్ప్‌ యాత్రలో ఆయన పాల్గొని ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ రకాల సంక్షేమ పథకాలపై అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. జాయింట్‌ కలెక్టర్‌ మయూర్‌ అశోక్‌ మాట్లాడుతూ, జిల్లాలో వికసిత్‌ భారత్‌ సంకల్ప్‌ యాత్ర మొత్తం 775 గ్రామాలకు గానూ ఇప్పటివరకు 475 గ్రామాల్లో పూర్తి అయ్యిందని తెలిపారు. వైసిపి నాయకులు ఉప్పాడ సూర్యనారాయణ తదితరులు మాట్లాడారు. పలుశాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను కేంద్రమంత్రి తిలకించారు. ఉజ్వలపథకం కింద గ్యాస్‌ కనెక్షన్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆర్‌డిఒ ఎం.వి.సూర్యకళ, వివిధ శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, బిజెపి నాయకులు పాల్గొన్నారు.కేంద్రమంత్రి వద్ద సమస్యలపై ఏకరువు గ్రామంలో కుళాయిలు లేక తాగునీటికి ఇబ్బంది పడుతున్నామని, పాఠశాల శిథిలావస్థకు చేరుకుందని చెరుకుపల్లి గ్రామానికి చెందిన మహిళలు కేంద్రమంత్రి మురుగన్‌ దృష్టికి తీసుకువెళ్లారు. పాఠశాల శిథిలావస్థకు చేరుకుందని, బాలికలు ఉపయోగించు కునేందుకు కనీసం మరుగుదొడ్లు లేవని ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో ఆయన పాఠశాలను పరిశీలించి చిన్నారులు, ఉపాధ్యాయులతో మంత్రి మాట్లాడారు. సమస్యలపై చర్యలు తీసుకుంటామని జాయింట్‌ కలెక్టర్‌ మయుర అశోక్‌ మంత్రికి తెలిపారు.

➡️