చివర్లోనైనా అడుగుతారా?

Feb 4,2024 23:58

ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధి : రాష్ట్ర శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో ఓట్‌ ఆన్‌ ఎకౌంట్‌ బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్ట నుంది. సార్వత్రిక ఎన్నికల షెడ్యూలు వచ్చే నెలలో వెలువడే అవకాశం ఉండటంతో ఈ సమావేశాలు ప్రస్తుత ఎమ్మెల్యేలు చివరి సమావేశాలుగా భావిస్తున్నారు. ఎన్నికల షెడ్యూలు విడుదలైన తేదీ నుంచి ప్రజా ప్రతినిధులు తమ అధికారాలను కోల్పోతారు. చివరి సమావేశాల్లో తమ గళం వినిపించేందుకు ఎంతమంది జిల్లా ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తారో చూడాల్సి ఉంది.ఐదేళ్లలో ఉమ్మడి జిల్లాలోని 17మంది ఎమ్మెల్యేల్లో నియోజకవర్గాల సమస్యలను ప్రస్తావించిన వారి సంఖ్య చాలా తక్కువే. ప్రభుత్వ విధానాలు, బడ్జెట్‌ ప్రతిపాదనలు, పలు అంశాలపై జరిగిన చర్చల్లో పాల్గొనడం తప్ప నియోజకవర్గాల్లోని సమస్యలను ప్రస్తావించి నిధులు రాబట్టుకున్న ఎమ్మెల్యే ఒకరిద్దరైనా లేరంటే అతిశయోక్తి కాదు. అయితే శాసన మండలిలో మాత్రం జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్సీలు జిల్లాకు చెందిన అంశాలపై ప్రస్తావించారు. రాష్ట్రానికి చెందిన అంశాలతో పాటు జిల్లాలోని వ్యవసాయ, నీటి పారుదల, విద్యా, వైద్య రంగాలపై సుదీర్ఘంగా మాట్లాడి పలు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లిన వారిలో ఎమ్మెల్సీ కె.ఎస్‌ లక్ష్మణరావు ముందు వరుసలో ఉన్నారు. 2019 మార్చిలో ఎమ్మెల్సీగా గెలిచిన ఆయన గత నాలుగున్నర ఏళ్ల కాలంలో ప్రతి సమావేశంలో కూడా శాసన మండలిలో కీలక అంశాలను ప్రస్తావించారు. వరికపూడిశెల, గుంటూరు ఛానల్‌, గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి, గుంటూరు నగర పాలకసంస్థలో అభివృద్ధి పనుల జాప్యం, యూజిడి, ఆర్‌యుబి, ఆర్‌వోబిల అంశాలతో పాటు మెడికల్‌ కళాశాల, పాఠశాల దుస్థితి, ఉపాధ్యాయులు కొరత, పాఠశాలల విలీనం నిర్ణయాల వల్ల ఏర్పడిన ఇబ్బందులు, డిఎస్‌సి నోటిఫికేషన్లు, మౌలిక వసతులు తదితర అంశాలపై ప్రముఖంగా ప్రస్తావించారు. మండలిలో జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వైసిపి ఎమ్మెల్సీలు రాజకీయ పరమైన లఘు చర్చల్లోనే ఎక్కువగా పాల్గొన్నారు. సమస్యల ప్రస్తావన చాలా తక్కువగానే ఉరటోంది. సమావేశాలు ఐదురోజులే జరిగే అవకాశం ఉందని అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు భావిస్తున్నారు. పల్నాడు జిల్లాలో వరికపూడిశెల ఎత్తిపోతల పథకానికి సిఎం జగన్‌ శంకుస్థాపన చేసి రెండు నెలలు అవుతున్నా ఇంత వరకు పనులు ప్రారంభం కాలేదు. ఈ అంశంపై ప్రతిపక్షపార్టీలు ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. గుంటూరు ఛానల్‌ విస్తరణ, పొడిగింపు పనులు ఇంత వరకు ప్రారంభంకాలేదు. గుంటూరు నగరంలో యూజిడి పనులు నిలిచిపోయి నాలుగేళ్లు దాటినా ప్రభుత్వం ఈ పనులపై దృష్టి సారించలేదు. కాల్వల మరమ్మత్తులు సకాలంలో జరగక జిల్లాలో గత ఖరీఫ్‌లో రైతులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఈ ఏడాది రబీ కూడా ముగుస్తున్నా ఇంతవరకు కాల్వల మరమ్మతులపై ఇంతవరకు జలవనరులశాఖ కార్యచరణ రూపొందించలేదు. రానున్న ఎన్నికల నేపథ్యంలో అయినా కొంత మేరకు పనులు జరుగుతాయని రైతులు ఆశిస్తున్నారు. కానీ నిధులు విడుదల కాకపోవడంతో రైతులు నిరాశకు గురవుతున్నారు. పల్నాడు జిల్లాలో మిర్చి పైరుకు నీటి ఎద్దడి ఏర్పడింది. సాగర్‌ జలాశయంలో నీటినిల్వ తక్కువగా ఉన్నందున ఇప్పట్లో విడుదల చేసే అవకాశంలేదు. దీంతో మిర్చి దిగుబడి తగ్గుతుందని రైతులు ఆందోళనలో ఉన్నారు. పంటను కాపాడుకునేందుకు ప్రభుత్వం ఇంత వరకు కార్యాచరణ రూపొందించలేదు.

➡️