చెరువుల్లామారిన రహదార్లు

ప్రజాశక్తి – నెల్లిమర్ల : నగర పంచాయతీలో రహదార్లు చెరువులను తలపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రధాన రహదారి పక్కన ఉన్న కాలువ పూడుకు పోయి మురుగునీరు రహదారి మీద ప్రవహించి వాహన దార్లు, పదాచార్లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. స్థానిక సిహెచ్‌సి వద్ద ప్రధాన కాలువ పూడుకుపోయి మురుగునీరు రహదారి మీద ప్రవహిస్తుంది, దీనికి మురుగు బయటకు పోయే అవకాశం లేదు. మొయిద జంక్షన్‌ నుంచి జరజాపుపేట వెళ్ళే రహదారిలో కల్వర్టు పూడుకుపోవడంతో అక్కడ కూడా మురుగు నీరు రోడ్డు మీద నిలిచిపోతుంది. దీనిపై స్థానికులు పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకు వెళ్ళినా రహదార్లు, భవనాల శాఖ చేయాలని చెప్పి తప్పించుకుంటున్నారే తప్ప సమస్య పరిష్కరించడం లేదని స్థానికులు వాపోతున్నారు. దీంతో బాటు నగర పంచాయతీలో పూర్వ కాలం నాటి సీసీ రోడ్లు, కాలువలు శిథిలావస్థకు చేరి స్థానికులు నడవలేని పరిస్థితిల్లో ఉన్నాయి. 10వ వార్డులో నాయుడు కాలనీ,9వ వార్డులో ఇందిరా కాలనీ వాసులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మురుగు నీరు సమస్య పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.

 

➡️