జగన్‌పాత్రపై విచారణ చేయాలి

Mar 2,2024 20:27

ప్రజాశక్తి-విజయనగరం కోట :  మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో జగన్‌ మోహన్‌ రెడ్డి పాత్రపై విచారణ జరగాలని విజయనగరం టిడిపి, జనసేన ఉమ్మడి అభ్యర్థి పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు డిమాండ్‌ చేసారు. శనివారం అశోక్‌ బంగ్లా టిడిపి కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. అత్యంత కిరాతకంగా హత్య కాబడిన వివేకానందరెడ్డి గుండె పోటు తో మరణించారని అబద్దపు మాటలు విజయసాయిరెడ్డితో ఎందుకు చెప్పించారో సమాధానం చెప్పాలన్నారు. ఈ హత్య కేసులో మొదట సిబిఐ విచారణ కోరిన జగన్‌, అధికారంలోకి వచ్చిన తర్వాత సిబిఐ విచారణ పిటిషన్‌ ఎందుకు వెనక్కి తీసుకున్నారో జవాబు చెప్పాలన్నారు, తన సొంత బాబారు హత్యకు గురై ఐదేళ్లు అవుతున్న కేసు విచారణలో పురోగతి ఎందుకు లేదని, కేసులో సంబంధం ఉన్న అవినాష్‌ రెడ్డిని జగన్‌ ఎందుకు కాపాడుతున్నారని ప్రశ్నించారు. తన సోదరి సునీత రెడ్డి అడుగుతున్న ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి జగన్‌ పై ఉందని అన్నారు. సునీత చేస్తున్న న్యాయ పోరాటానికి తెలుగుదేశం తరపున మా మద్దతు ఉంటుందని తెలిపారు.

టిడిపి ఇంటింటి ప్రచారం

శంఖారావం -బాబు సూపర్‌ సిక్స్‌ కార్యక్రమంలో భాగంగా శనివారం నగరంలోని అరుంధతి కోలనీ, శాంతినగర్‌, సాలిపేట, కొత్తపేట యాత వీధి, సాకేటి వీధి, బంగారమ్మపేట ప్రాంతాల్లో నియోజకవర్గ ఇన్‌ఛార్జి పూసపాటి అదితి గజపతి రాజు ఇంటింటి ప్రచారం నిర్వహించి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన సూపర్‌ సిక్స్‌ హామీలను ప్రజలకు వివరించారు, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం -జనసేన ప్రభుత్వం ఏర్పడాలని అన్నారు. 20వ డివిజన్‌ సాలిపేట కు చెందిన బెహరా అచ్చియమ్మ, మొండి రమణమ్మ, జయలక్ష్మి తో పాటు 40 మంది మహిళలు అదితి గజపతి రాజు సమక్షంలో వైసిపి నుంచి టిడిపిలో చేరారు. వైసిపి పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడే వారిపై అక్రమ కేసులు పెట్టి కక్ష సాధింపు రాజకీయాలు చేయడం తప్ప ప్రజలకు చేసిన మంచి ఏమీ లేదని అన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవిపి రాజు, కార్యాలయ కార్యదర్శి రాజేష్‌ బాబు,పట్టణ అధ్యక్షులు ప్రసాదుల లక్ష్మీ వరప్రసాద్‌, మండల పార్టీ అధ్యక్షులు బొద్దల నర్సింగరావు , కార్యదర్శి గంటా పోలినాయుడు, వేచలపు శ్రీనివాసరావు, అవనాపు విజరు , పిల్లా విజరు కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️