జనగళం సభకు తుది దశలో ఏర్పాట్లు

Mar 15,2024 22:43

ఏర్పాట్లను పరిశీలిస్తున్న పత్తిపాటి పుల్లారావు
ప్రజాశక్తి – చిలకలూరిపేట :
మండలంలోని బొప్పూడిలో టిడిపి, జనసేన, బిజెపి ఆధ్వర్యంలో ఆదివారం జరిగే ఉమ్మడి బహిరంగ సభ (జనగళం)కు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నట్లు మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు చెప్పారు. ఈ మేరకు ఏర్పాట్లను ఆయన శుక్రవారం పరిశీలించారు. విఐపి గ్యాలరీ, ఇతర పనులను శనివారం సాయంత్రానికి పూర్తి చేస్తామన్నారు. హెలీప్యాడ్లు, విఐపి గ్యాలరీ, వాహనాల పార్కింగ్‌, బ్యారీకేడ్లు దాదాపు పూర్తవ్వొచ్చాయన్నారు. విఐపిల కోసం ప్రత్యేకంగా ఏడు హెలిప్యాడ్లను సిద్ధం చేశామన్నారు. గతంలో ప్రధానులుగా చేసిన ఇందిరా గాంధి, పీవీ నరసింహారావు చిలకలూరిపేటకు వచ్చారని, ఇప్పుడు మోడీ వస్తున్నారని అన్నారు. ప్రధాని తొలుత ప్రత్యేక విమానంలో బాపట్ల జిల్లా కోరిశపాడు మండలం రేణంగివరం వద్దకు వస్తారని, ఇందుకోసం ప్రత్యేకంగా రన్‌వేను ఏర్పాటు చేశారని చెప్పారు. రేణంగివరం నుండి సభా వేదిక వద్దకు హెలికాఫ్టర్‌లో వస్తారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అతిపెద్ద భారీ సభగా ఇది నిలుస్తుందని, ఉమ్మడి గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో ఒక్కో జిల్లా నుండి నియోజకవర్గానికి 5-10 వేల మంది ద్విచక్ర వాహనాలపై రావాలని చంద్రబాబు ఆదేశించారని తెలిపారు. ఆర్టీసీ బస్సులు ఇస్తామని చెప్పిన అధికారులు తాము అడిగినన్ని ఇవ్వడం లేదని అన్నారు. సభకు వచ్చే వారికి ఇబ్బందులేమీ తలెత్తకుండా పక్కా ప్రణాళికతో ఏర్పాటు చేస్తున్నామన్నారు. సభలో మోడీ, చంద్రబాబు, పవన్‌తోపాటు టిడిపి రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌, ఎమ్మెల్యే బాలకృష్ణ, మూడు పార్టీల ప్రధాన నాయకులు హాజరవుతారని చెప్పారు.

➡️